Reform Criminal Laws: “భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటున్నది. ఒకరకంగా దేశం ఇప్పుడు అమృతకాలంలో ఉంది. నేపథ్యంలో బానిస మనస్తత్వానికి, వలస వాద వాసనలకు ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఐసీసీ, సీ ఆర్ సీ సీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులను రద్దు చేయబోతున్నాం. పౌరుల హక్కుల పరిరక్షణకు వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకొస్తాం. కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోర్టులకు వెళ్లడమే పెద్ద శిక్షగా భావిస్తున్నారు. కొత్త బిల్లుల ప్రధాన లక్ష్యం న్యాయం చేయడమే.. శిక్షించడం కాదు. నేరాలు చేయకూడదన్న భావనను పెంచే విధంగా శిక్షలు ఉంటాయి” ఇవీ లోక్ సభ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు చివరి రోజు హోం మంత్రి అమిత్ షా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్లుగా దేశం అనుసరిస్తున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఐపిసి సెక్షన్ ఇక గాయబ్ అవుతుంది. దాని స్థానంలో
భారత న్యాయ సంహిత అనే పదం వచ్చి చేరుతుంది. ఇండియన్ పీనల్ కోడ్, నేర శిక్షాస్మృతి, ఎవిడెన్స్ యాక్ట్ లను కేంద్రం ప్రక్షాళన చేయడం మాత్రమే కాదు, వాటి పేర్లను జాతీయీకరణ చేయడం మాత్రమే కాదు.. కేంద్రం సెక్షన్లను కూడా పూర్తిగా మార్చివేసే కార్యక్రమానికి నడుంబిగించింది.
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను పక్కన పెట్టి భారతీయ నాగరిక సురక్ష సంహిత ను అమలు చేయనున్నారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య ను ప్రవేశపెడతారు. ఇప్పటిదాకా హత్యా నేరాన్ని సెక్షన్ 302 ఐపిసి కింద నమోదు చేస్తున్నారు. ఇకపై అది బి ఎన్ ఎస్ 99 గా మారిపోతుంది.. ఇలాంటి అనేక కీలకమైన, సంచలనమైన మార్పులను కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరిచింది. ప్రధానంగా బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్లో పూర్తిస్థాయి మార్పులను తీసుకొచ్చింది
రాజ ద్రోహానికి కొత్త రూపం ఇచ్చారు
దేశద్రోహ లేదా రాజ ద్రోహ చట్టాన్ని సెక్షన్ 124ఏ ను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. అయితే దానిని కొత్త రూపంలో ముందుకు తీసుకొచ్చింది. దాని స్థానంలో 150 సెక్షన్ ను ఎందుకు తీసుకొచ్చింది. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే చర్యలు, వేర్పాటు వాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసకర కార్యకలాపాలు ఈ సెక్షన్ పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది.. ఈ నేరాలకు గరిష్టంగా జీవిత ఖైదు పడుతుంది. అలాగే మూక హత్యలకు మరణ దండన ప్రతిపాదించింది. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష, గ్యాంగ్ రేప్ చేసే వారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది.
రికార్డుల్లో చూపించాలి
పోలీసులు వివిధ కేసులకు సంబంధించి తనిఖీలు లేదా సోదాలు నిర్వహించినప్పుడు కచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది..ఈ_ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం, జీరో ఎఫ్ ఐ ఆర్ విధివిధానాల ఖరారు, సివిల్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్ కు నిర్దిష్ట గడువులోగా అనుమతులు ఇవ్వడం.. వంటి అంశాలను ఈ బిల్లులో కేంద్రం ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే వీటిపై మరింత లోతుగా చర్చించి తుది రూపు ఇచ్చేందుకు బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నేర నిర్ధారణలు 90 శాతానికి చేర్చాలని, ఇందులో భాగంగానే ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టామని కేంద్రం వివరించింది. ఏడు సంవత్సరాలు లేదా అంతకుమించి జైలు శిక్ష పడేందుకు వీలు ఉన్న కేసుల్లో నేర ఘటన ప్రాంతాలను ఫోరెన్సిక్ బృందాలు తప్పనిసరిగా సందర్శించాలని కేంద్రం నిబంధన తీసుకొచ్చింది. ఈ బిల్లులు గనుక చట్టరూపం దాల్చితే నేర న్యాయవ్యవస్థ సమూలంగా మారుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. ప్రతి ఒక్కరికి గరిష్టంగా మూడు సంవత్సరాల లోపే న్యాయం అందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడే వారికి సామాజిక సేవ శిక్ష విధించాలి తొలిసారి ప్రతిపాదించినట్టు ఆయన వివరించారు.