Vijayawada Constituency: ఏపీలో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అధికార వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధపడుతుండగా… విపక్షాల పొత్తుల లెక్కలు ఇంకా తేలలేదు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈసారి టఫ్ ఫైట్ ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి ఈసారి బెజవాడ రాజకీయం ప్రత్యేకం.
వైసీపీ ఆవిర్భావం నుంచి పట్టు దొరకని ప్రాంతంగా విజయవాడ ఉంది. గత రెండు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని టిడిపి గెలుపొందింది . ఈసారి దానిని ఎలాగైనా బ్రేక్ చేయాలన్నా కసితో వైసిపి పని చేస్తోంది. నగరంలోని మూడు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది.
తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా జనసేన ఈ సీట్ను ఆశిస్తోంది. గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలమంచిలి రవి జనసేన అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా బరిలో దిగిన రవి విజయం సాధించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న గద్దె రామ్మోహన్ కు గన్నవరం సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక వైసిపి నుంచి తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. అవినాష్ ఇప్పటికే తన పని తాను చేసుకుపోతున్నారు. కృష్ణలంక,రాణి గారి తోట,గుణదలలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అటు ఎలమంచిలి రవి సైతం కృష్ణలంక కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన ఓట్ బ్యాంక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేయనున్నారు. ఈ స్థానాన్ని కూడా జనసేన ఆశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పోతిన మహేష్ చాలా యాక్టివ్ గా పని చేశారు. అయితే ఉన్నట్టుండి ఆయన ఇటీవల సైలెంట్ అయ్యారు. దీంతో అక్కడ టిడిపి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రాజకీయాలు మాత్రం స్తబ్దుగా ఉన్నాయి.