మొదటి కరోనా లాక్ డౌన్ వేళ దేశ, విదేశాల్లో ఉన్న వలస కార్మికులను ఇంటికి చేర్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు సోనూసూద్. కోట్లు ఖర్చు పెట్టి అందరికీ సాయం చేశాడు. ట్విట్టర్ లో అడగడమే ఆలస్యం ఆపన్న హస్తం అందించాడు. అంతటి గొప్ప మనుసున్న ఈ నటుడు ఇప్పటికీ కూడా తన చేతనైన సాయం అందిస్తూనే ఉన్నాడు.
ఇటీవల మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన భారతి అనే యువతి కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. వైరస్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85శాతం వరకూ దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సూచించారు.
ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్.. భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకొచ్చాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఈరోజు ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
భారతి కోసం ఇంత చేసిన సోనూ సూద్ చివరకు ఆమె మరణించిందని తెలుసుకొని ఉద్వేగానికి గురయ్యాడు.యువతిని కాపాడడానికి తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరకు విషాదమే మిగిలిందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశాడు. ఆమెను బతికించలేకపోయానని.. నా హృదయం ముక్కలైందని ట్వీట్ చేశాడు.