Sonu sood : కరోనా మహమ్మారి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్న వేళ.. వేలు, లక్షల కోట్లు సంపాదించిన వారు పైసా విదిల్చడానికి చేయి రాని సందర్భంలో.. నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు సోనూ. ఫస్ట్ వేవ్ తోనే మొదలైన సోనూ సేవలు అప్రతిహతంగా సాగుతూనే ఉన్నాయి. అలాంటి వ్యక్తిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం సంచలనం రేకెత్తించింది. మూడు రోజులపాటు కొనసాగిన తనిఖీల్లో దాదాపు 20 కోట్ల రూపాయలకుపైగా పన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారులు ప్రకటించారు.
సోనూ సూద్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు తెలిపారు. దీని కింద క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్టు వెల్లడించారు. సోనూ సూద్ తోపాటు ఆయన సహచరుల కార్యాలయాల్లోనూ పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు గుర్తించినట్టు తెలిపారు. సోనూ సూద్ ఏర్పాటు చేసిన ఛారిటీ సంస్థ 18 కోట్లకు పైగా విరాళాలు సేకరించించిందని ఐటీ అధికారులు తెలిపారు. అయితే.. అందులో కేవలం 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగిలిన డబ్బు మొత్తం ఆ సంస్థ ఖాతాలోనే ఉందని తెలిపారు.
ఈ ఐటీ దాడులపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా.. తనవల్ల అయినంత సేవ చేసి, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తిపై ఐటీ దాడులు చేయించడం.. పూర్తిగా రాజకీయకక్షగా ఆరోపిస్తున్నారు నెటిజన్లు.
ఇటీవల.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోనూ సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే కార్యక్రమానికి సోనూ ప్రచారకర్తగా సీఎం కేజ్రీవాల్ నియమించారు. ఇలాంటి సమయంలో సోనూపై ఐటీ దాడులు చేయిచండం పట్ల ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా.. రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తున్నాయి. అయితే.. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.
అయితే.. ఈ విషయంపై సోనూసూద్ తొలిసారిగా స్పందించారు. ఆపద సమయంలో బాధితుల ప్రాణాలను కాపాడటానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉందని చెప్పారు సోనూ. తాను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసే కంపెనీలు చెల్లించాల్సిన సొమ్మును.. తన చారిటీలకు చెల్లించాలని కోరినట్టు సోనూ తెలిపారు. అధికారులకు అవసరమైన మేరకు తన ఫౌండేషన్ వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన సోనూ.. ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు.
అంతేకాదు.. తన సేవలు ఇకమీద కూడా కొనసాగుతాయని చెప్పారు. ఐటీ అధికారుల తనిఖీల కారణంగా నాలుగు రోజులుగా బాధితులకు సహాయం చేయలేకపోయానని.. ఇప్పటి నుంచి మళ్లీ సేవలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. మంచి చేయాలి.. మంచిగా ఉండాలి.. చివరకు మంచి కోసం మంచే జరగాలి అంటూ హిందీలో ట్వీట్ చేశారు. సోనూకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.