Sonia Gandhi: దేశ రాజకీయాలు కీలక దశలో ఉన్నాయని చెప్పొచ్చు. మోడీ (PM Narendra Modi) సారధ్యంలోని బీజేపీ.. రెండు సార్లు అధికారం చేపట్టింది. పదేళ్లలో సహజ వ్యతిరేకత ఉంటుంది. పైగా.. కరోనా నియంత్రణలో విఫలమవడం, వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం.. వంటివి బీజేపీకి నెగెటివ్ అంశాలుగా ఉన్నాయి. దీంతో.. వచ్చే ఎన్నికలు గతంలో మాదిరి సాఫీగా సాగిపోయే పరిస్థితి లేదు. ఇటు చూస్తే.. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకునే పరిస్థితుల్లో విపక్షం లేదు. రెండుసార్లు పడిపోయిన కాంగ్రెస్.. తిరిగి కోలుకోలేదు. సమీప భవిష్యత్ లో అది కనిపించట్లేదు కూడా. ఈ విధంగా.. వచ్చే 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో.. నరేంద్ర మోడీని ఎలాగైనా గద్దె దించేందుకు అతిపెద్ద బాధ్యతను నెత్తికెత్తుకున్నారు సోనియా గాంధీ. మరి, అందులో విజయం సాధిస్తారా? అన్నదే ఇప్పుడు చర్చ.
2014, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వేవ్ తో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. 2024లో తిరిగి మూడోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో తెలుసుకొని.. వాటిని సరిచేసుకునే పనిలో ఉంది. ఇటు విపక్షాలు కూడా.. మోడీని ఓడించేందుకు పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే.. ఎలా ముందుకు సాగాలన్నదానిపై స్పష్టత రాలేదు.
ఈ క్లారిటీ తెచ్చేందుకు.. విపక్షాలన్నీ ఏకమై బీజేపీపై పోరాటం సాగించేందుకు.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారు. మొన్నటి వరకు అనారోగ్య సమస్యలతో కాస్త సైలెంట్ గా ఉన్న సోనియా.. ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ యేతర థర్డ్ ఫ్రంట్ కాకుండా.. కాంగ్రెస్ తో కూడిన విపక్ష కూటమిగా బీజేపీని ఓడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
గతంలో మాదిరిగా దేశ రాజకీయాలను శాసించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. కాబట్టి.. ఒంటరిగా బీజేపీని ఎదుర్కోవడం అసాధ్యం. కాబట్టి.. కొన్ని సీట్లను త్యాగం చేసైనా సరే విపక్షాలను కలుపుకోవాల్సిన అనివార్యత కాంగ్రెస్ కు ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం స్థాపిస్తే తప్ప.. పార్టీకి పూర్వవైభవం తేవడానికి అవకాశం చిక్కదు. ఈ విషయంపై స్పష్టత తెచ్చుకున్న హస్తం పార్టీ.. రెండు మెట్లు దిగి, విపక్షాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది.
మొన్న రాహుల్ గాంధీ 14 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, మోడీ సర్కారును ఎదుర్కోవాల్సిన వ్యూహంపై చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ నివాసంలోనూ విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 20న సోనియా ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి మమతా బెనర్జీ సైతం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి కీలక నేతలు భేటీ కాబోతున్నారు. ఈ వరుస సమావేశాలను చూసినప్పుడు.. బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకున్నాయనే విషయం స్పష్టమవుతోంది. అయితే.. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందన్నదే ప్రశ్న.
సీట్ల పంపకం నుంచి.. ప్రధాని పీఠం దాకా పీటముడులు చాలా ఉన్నాయి. కీలకమైన పీఎం సీటులో ఎవరు కూర్చోవాలన్నది ప్రశ్న. రాహుల్ ను గద్దెనెక్కించాలని కాంగ్రెస్ చూస్తుంటే.. ఒక్కసారైన ప్రధాని అనిపించుకోవాలని మమత, అదే జీవిత ఆశయంగా శరద్ పవార్ వంటి నేతలు ఉన్నారు. మరి, వీరంతా కలిసి బీజేపీని ఎదుర్కోవడం.. గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించడం.. దాన్ని ఐదేళ్ల వరకు కొనసాగించడం అనేది ఎంత వరకు సాధ్యమవుతుందనే అనుమానాలైతే ఉన్నాయి. మరి, సోనియా గాంధీ ఈ ప్రయత్నంలో ఎంత వరకు విజయం సాధిస్తారు? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Sonia gandhi wants to win 2024 general election with local parties
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com