Somu Veerraju: ఏపీ బీజేపీలో నాయకులకు కొదువ లేదు. పేరు చివరన రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులు చెప్పనక్కర్లేదు. కానీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వారి జాడ లేదు. ఏపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మినారాయణ లాంటి పెద్ద నాయకుల లీస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ పెద్ద నాయకుల ప్రకటనలు పెద్దవి. చేసే పనులు చిన్నవన్న అపవాదు ఉంది. పెద్ద నాయకులంతా పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు మీడియా మీటింగ్‌లకే పరిమితం అవుతుండడంపై కూడా శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి.
మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 23న ఎన్నికలు, 26న ఫలితాలు. ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం బరిలో నిలిచింది. బీజేపీ మిత్రపక్షం జనసేన మద్దతు ఎవరికో తేల్చి చెప్పలేదు. జనసేన మద్దతు ఇస్తుందనే ఆశతో బీజేపీ వుంది. పేరుకు మాత్రం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయే తప్ప, వాటి మధ్య సంబంధాలు అలా లేవు.
Also Read: KCR- RTC Charges Increased Again: కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయా
ఆత్మకూరులో బలంతో సంబంధం లేకుండా బీజేపీ బరిలో నిలబడడం ఆశ్చర్యమే. కనీసం ఏజెంట్లను నిలుపుకునే పరిస్థితి ఉందా? అంటే అనుమానమే. బీజేపీ తరపున గుండ్లవల్లి భరత్‌కుమార్ పోటీలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కరే ఒంటరిగా పోరాడుతున్నారు. మీడియా సమావేశాలు, ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ ఉనికి చాటుకునేందుకు, చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియా పులులు అయిన పెద్ద నాయకులు కనిపించకపోవడంతో వారి పాత్రలు, అభినయాలపై బీజేపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.
చేసేవి పెద్ద ప్రకటనలు..
తినడానికి తిండి లేదు. మీషానికి సంపంగి నూనె అన్న చందంగా ఉంది ఏపీలో బీజేపీ నాయకుల పరిస్థితి. అందరూ అవసరాల కోసం పార్టీలో చేరిన వారే తప్ప.. పార్టీ అవసరాలకు, బలోపేతానికి ఉపయోగపడిన నాయకుడు ఒక్కడూ లేడు. పైగా జగన్ కోవర్డులు ఒక వైపు, చంద్రబాబు కోవర్టులు మరోవైపు అన్నట్టు పార్టీ అడ్డగా చీలిపోయింది. గ్రామాలు, కనీసం తాము నివాసముంటున్న వీధుల్లో కూడా గుర్తింపులేని, ఓట్లు రాబట్టుకోని బీజేపీ నాయకులకు జాతీయ, రాష్ట్ర పదవులు అలంకారప్రాయం అని చెప్పక తప్పదు. ఇక వీరు చేసే ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఏయ్ వైసీపీ నాయకుల్లారా ఖబడ్దార్. మిమ్మల్ని దింపి మేమే అధికారంలోకి వస్తామంటారు. టీడీపీ అసలు ప్రతిపక్ష పార్టీయేనా అని గేలి చేస్తారు. కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నా చాలా మంది అటు టీడీపీ, వైసీపీతో సహజీవనం చేస్తారు. రెండు పార్టీల ఉమ్మడి నాయకుడిగా చాలామణి అవుతుంటారు. ఇందులో విశేషమేమిటంటే జగన్ కు అనుకూలంగా వ్యవహరించే నాయకుల వార్తలు, కథనాలు ‘సాక్షి’లో పతాక శీర్షికన వస్తుంటాయి. అలాగే చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే బీజేపీ నాయకుల వార్తలకు ఎల్లోమీడియాలో ఎనలేని ప్రాధాన్యం లభిస్తుంటుంది.
ముఖం చాటేస్తున్న నేతలు
పార్టీని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా ఎదిగిన బీజేపీ నాయకులంతా ఇప్పుడు ఏమయ్యారు? ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు వెళ్లడం లేదు. బీజేపీని, కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలను పుష్కలంగా పొందిన వాళ్లు, ఇప్పుడు పార్టీకి అవసరమైనపుడు మాత్రం ఎందుకు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు? అనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచి వస్తు న్నాయి. ఆత్మకూరులో బీజేపీ గెలవలేదనే వాస్తవాన్ని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుందామని ఆరాటపడుతున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడికి సొంత పార్టీ మీడియా పులుల నుంచి ఎందుకు మద్దతు లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా బీజేపీ మీడియా పులులు కాస్త నగరాలను వదిలి, ఆత్మకూరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఈ పది రోజులైనా పార్టీ కోసం పని చేసి రుణం తీర్చుకోవాలనే బీజేపీ శ్రేణుల డిమాండ్‌ను గౌరవిస్తారని ఆశిద్దాం.
Also Read:Pawan Kalyan Former Look: ఈ లుక్ చాలు పవన్ కళ్యాణ్ ఎంత రైతు పక్షపాతో తెలుస్తుంది!