Somu Veeraju vs Janasena: పొత్తుల్లేవ్.. దోస్తానీ లేనే లేదు.. తగ్గేదే లే అన్నట్టుగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రెచ్చిపోయారు. తన జిగ్రీ దోస్తీ పవన్ కళ్యాణ్ తీరును ఎండగట్టారు. పొత్తు పొత్తే.. తిట్టు తిట్టే అన్నట్టుగా వ్యవహరించారు. విజయవాడలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షం జనసేనతోపాటు మంత్రి కేటీఆర్ కు బాగా కాలినట్టైంది. వీళ్లిద్దరూ తాజాగా కౌంటర్లు ఇచ్చారంటే సోము ఎంత స్ట్రాంగ్ గా విమర్శించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుల్లో ఉన్నాయి. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. అయినా కూడా సోము వీర్రాజు అవేం పట్టించుకోకుండా తన మిత్రపక్షమైన జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఈ సభలో విమర్శలు చేయడం సంచలనమైంది. అయితే సోము విమర్శలకు ఓ అర్థం పర్థం ఉంది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉద్యమిస్తున్నారు. ఈ ప్రైవేటీకరించేది బీజేపీ కావడంతో ఇక్కడ పొత్తు పెట్టుకొని ఉద్యమించిన పవన్ ను సైతం వదలకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాస్త గట్టిగానే మందలించేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణతోపాటు స్పిన్నింగ్ మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు మూసివేతకు నిరసనగా కూడా పవన్ పోరాడాలని హితవు పలికారు.
Also Read: చంద్రబాబు రహస్య టూర్.. ఆ దేశానికి ఫ్యామిలీతో.. ఏంటీ కథ..?
అయితే పొత్తులో ఉండి కూడా సోము వీర్రాజు ఇలా డైరెక్టుగా పవన్ ను విమర్శించడాన్ని మిత్రపక్షం జనసేన జీర్ణించుకోలేదు. అందుకే తాజాగా జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘ఏపీ బీజేపీ అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని.. ఎమోషనల్ గా లూజ్ అయ్యాడని’ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా.. ప్రతిపక్షంలో ఉన్న సోము వీర్రాజు ఏం చేస్తున్నాడంటూ విమర్శించారు.
దీంతో బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా పవన్ బీజేపీ వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్నారు. ఇక ఏపీ బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కలిసి ఆందోళన చేయడం లేదు. వైసీపీని టార్గెట్ చేసి ఏపీలో సొంతంగా ఎదిగేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీని లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది.
ఇక సోము వీర్రాజు తాజాగా సభలో రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది బీజేపీకి ఓటేసి గెలిపించాలని.. చీప్ లిక్కర్ రూ.50 కే ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘వావ్ వాట్ ఏ స్కీం.. వాట్ ఏ షేమ్.. రూ.50కే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా? అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా?’ అని ఘాటుగా ప్రశ్నించారు. సోము వీర్రాజు విజయవాడలో మాట్లాడితే అది దేశమంతా బీజేపీ విధానమంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు బీజేపీని ఇరుకునపెట్టినట్టైంది. ఇలా సోము వీర్రాజు అంటించిన మాటల మంటలు అటు జనసేనకు.. ఇటు కేటీఆర్ కు కాస్త గట్టిగానే తగిలాయని చెప్పొచ్చు.
Also Read: బీజేపీ చీప్ లిక్కర్ ఆఫర్.. కేటీఆర్ సంధించిన సెటైర్