Somu Veerraju- Pawan Kalyan: గత కొద్దిరోజులుగా నెలకొన్న సంగ్ధితను జనసేనాని పవన్ కళ్యాణ్ తెరదించారు. రాష్ట్రంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. అటు బీజేపీతో పాటు ఇటు టీడీపీతో కలిసి నడవాలని దాదాపు నిర్ణయించుకున్నారు. ఇక తేల్చుకోవాల్సింది ఆ రెండు పార్టీలేనని తేల్చిచెప్పారు. తద్వారా టీడీపీతో పాటు బీజేపీపై ఒత్తిడి పెంచేశారు. దీంతో ఇక ఇప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీ – టీడీపీ నాయకత్వమే. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది అందులో ఒక కీలక ప్రతిపాదన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలపైన స్పందించారు. బీజేపీ – జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పవన్ చెప్పినట్లుగా ఎవరు తగ్గుతారో.. ఎవరు నిలబడతారో చూడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, టీడీపీని సైతం కలుపుకొని ముందుకెళ్లే అంశం పైన మాత్రం బీజేపీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వటం లేదు. కనీసం దీనిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కేవలం జనసేనతో మాత్రమే తమ ప్రయాణముంటుందని రాష్ట్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల లోపు ఏదైనా అద్భుతం జరగవచ్చన్న జనసేనాని అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే పనిచేయవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇన్నాళ్లూ పొత్తులపై పవన్ నుంచి సానుకూల స్పందన కోసం వేచిచూసిన చంద్రబాబు మహానాడు విజయవంతం కావడంతో మనసు మార్చుకున్నారు. కుప్పం వేదికగా జనసేనతో పొత్తు అంశం చర్చకు వచ్చిన సమయంలో ఒన్ సైడ్ లవ్వుగా పేర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు…ఇప్పుడు పవన్ నుంచి స్పందన రావటంతో..పొత్తు దిశగా మరో అడుగు ముందుకు వేస్తారా లేక … ఇంకా నిరీక్షిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒక విధంగా ఇప్పుడు పొత్తుల అంశం చంద్రబాబు ప్రతిపాదనల మేరకే ఆధారపడి ఉంది. తగ్గాలని అనే పవన్ వ్యాఖ్యల వెనుక అధికారంలో – సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత పెరగాలనేదే ప్రధాన అంశంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read: Telangana Intellectuals- Jagan: జగన్ కు తెలంగాణ మేధావులు సలహాలు ఎందుకిస్తున్నారు?
ఇక, పొత్తుల సంగతి ప్రస్తావిస్తూనే పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలు ప్రకటించటం మరో చర్చకు కారణమైంది. 2024 ఎన్నికలకు సంబంధించిన పలు హామీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు.యువత, రైతులను టార్గెట్ చేసుకుంటూ ఆయన హామీలిచ్చారు. ప్రాధాన్యతాంశాలుగా తీర్మనాలు రూపొందించి ఆమోదించారు. ప్రజా సంక్షేమం దిశగా తమ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని సంకేతాలిచ్చారు. లక్షల కోట్ల అవినీతిని అరికడితే ఈ హామీల అమలు సాధ్యమే అని తెలిపారు. అవి…అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని అభివృద్ధి అంచెలంచెలుగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. అల్పాదాయ వర్గాలకు ఇసుకను ఉచితంగా అందిస్తామని హామీగా ప్రకటించారు. ఉపాధి లేక యువత గంజాయి రవాణా వంటి అక్రమ మార్గాలు, ఆందోళన బాట పట్టకుండా… పది వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి ఏటా లక్ష మంది యువతకు పెట్టుబడిని అందజేస్తామంటూ ప్రతిపాదించారు. ఇలా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. ఐదేళ్లలో ఐదు లక్షల మందికి పెట్టుబడి అందిస్తామని … ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దు చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ శక్తిని అంచనా వేసి మాత్రమే అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కూటమికి సీఎం అభ్యర్థిగా వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. అదే సమయంలో గతంలో తగ్గేలా లేదని వ్యవహరిస్తున్నారు. హెచ్చరికలు పంపుతున్నారు. . వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పటం..ఇప్పుడు పొత్తు ఆప్షన్లు ఓపెన్ గా చెప్పటం ద్వారా ఇప్పుడు వైసీపీ వ్యతిరేక రాజకీయానికి కేంద్ర బిందువుగా మారారు. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కేంద్రంగా భరోసా యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శనివారం పవన్ లేఖ రాశారు. ఇక, ఇప్పుడు పవన్ ఆప్షన్ల పైన టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. మొత్తానికి పవన్ విసిరిన బంతి అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు కోర్టులో చేరింది. మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ..
[…] […]
[…] […]