బిజెపి నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు సరైన సమయంలో పగ్గాలు చేపట్టాడు అనే చెప్పాలి. మొదటి నుండి రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ మంచి మాటకారి గా పేరు తెచ్చుకున్న వీర్రాజు అధ్యక్షుడిగా నియమించబడిన మరుక్షణం నుండి ప్రతి రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముందుగా ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి తన నియామకంపై కృతజ్ఞతలు చెప్పిన ఆయన కన్నా లక్ష్మీనారాయణ కన్నా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించారు.
అయితే ఎవరూ ఊహించని రీతిలో వీర్రాజు మాజీ రాజకీయ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి ను కలవడం పెద్ద సంచలనం అనే చెప్పాలి. “మిత్రపక్షం జనసేన తో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి” అని చిరంజీవి సూచించినట్లు వీర్రాజు పేర్కొనడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి చిరంజీవి జగన్ కు సన్నిహితంగా ఉంటున్నాడు అన్న వార్తలు భారీగా వస్తున్నాయి. పైగా వైసీపీలో గంటా చేరిక వెనుక చిరు…. జగన్ తో మంతనాలు జరిపినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో వీర్రాజు భేటీ కావడం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించినట్లు చెప్పడం నిజంగానే పెద్ద విషయం.
ఇదిలా ఉండగా వెంటనే అతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశాడు. “నాకు పవన్ చాలా మంచి స్నేహితుడని…. అందరూ నన్ను సోము వీర్రాజు అని పిలిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం సోమరాజు అని పిలుస్తారని…. తనకు ఆయనతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంద”ని వీర్రాజు పలుసార్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే వీర్రాజు ఇలా అన్నదమ్ములనుఒకరి తర్వాత ఒకరిని వరుసబెట్టి కలవడానికి కారణం కాపు సామాజిక వర్గం ఓట్లను బీజేపీ ఇప్పుడు భారీగా టార్గెట్ చేసేందుకు నిర్ణయించుకోవడమే అని బయట పెద్ద టాక్ నడుస్తోంది.
అందుకే మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ తో పాటు అశేష ప్రజాధరణ కలిగిన హీరో చిరంజీవి ని కూడా కలిసి తమకు తగిన గుర్తింపు రాష్ట్ర ప్రజల వద్ద నుండి లభించిన మరుక్షణం ఈ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఇవన్నీ హింట్ లు అని అంటున్నారు. అలాగే..వైసిపి, టిడిపి రాజధాని విషయంలో కొట్టుకుంటున్న సమయంలో బిజెపి మాత్రం అదన్ చూసి వీర్రాజు తో సరైన రాజకీయం నడిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.