Somu Veerraju: విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని నాడు చంద్రబాబు ఊరూ వాడా ప్రచారంచేశారు. ఏపీ ప్రజల్లో బీజేపీని విలన్ గా చూపించారు. బీజేపీని ఎంత డ్యామేజ్ చేయ్యాలో అంతగా చేశారు. ఈ విషయంలో సక్సెస్ అయిన చంద్రబాబు అదే స్థాయిలో మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికీ ఆ శాపం ఆయన్న వెంటాడుతునే ఉంది. బీజేపీకి దగ్గరవ్వాలన్న ప్రయత్నాలకు నాటి పరిణామాలు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబులా స్ట్రయిట్ గా కాకుండా ఇంటర్నల్ గా మాత్రం బీజేపీని బూచీగా చూపెట్టే ప్రయత్నమైతే చేస్తున్నారు. అయితే దీనిని గుర్తించిన రాష్ట్ర బీజేపీ ఇప్పుడు మేల్కొంది. చంద్రబాబుతో పాటు జగన్ ను ఇరుకున పెట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బ్రహ్మాస్త్రాలను సంధిస్తున్నారు.

ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, వాటికి కేటాయించిన భూములపై ఇటీవల బీజేపీ నేతలు వాయిస్ పెంచారు. ఇప్పటివరకూ చోటుచేసుకున్న భూముల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. విభజిత రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన జాకీ కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్లిందని ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ నిధులతోపనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సొంత పార్టీ నేతలను ఎలా కట్టడి చేస్తున్నారో తెలపాలని సీఎం జగన్ ను సోము వీర్రాజు ప్రశ్నించారు. దీనిపై నేరుగా సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలేమిటి? ఇప్పటివరకూ ఎన్ని భూములను కేటాయించారు? అందులో వినియోగంలో ఉన్నవి ఎన్ని? వృథాగా ఉన్నవి ఎంత? ఎన్ని భూముల్లో పరిశ్రమలను నెలకొల్పారు? ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు? అన్నదానిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏనాడైనా పరిశ్రమల ఏర్పాటుపై సమీక్షించారా? అని ఆక్షేపించారు. అయితే సడన్ గా సోము వీర్రాజు వాయిస్ పెంచడం వెనుక అనేక కారణాలున్నాయి.

కేంద్ర ప్రభుత్వం విభజన హామీల పరిష్కారంలో భాగంగా ఏపీకి అనేక ప్రాజెక్టులను కేటాయించింది. జాతీయ రహదారులతో పాటు రైల్వే మార్గాలను సైతం నిర్మిస్తోంది. కానీ ఆ స్థాయిలో కేంద్రానికి పేరు రావడం లేదు. పైగా జగన్ సర్కారు అవన్నీ తాము చేస్తున్నట్టు హైజాక్ చేస్తోంది.పైగా కేంద్ర ప్రభుత్వ చొరవతో చాలా రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. కానీ లోకల్ వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారు. అటు పరిశ్రమలకు కేటాయించిన భూములను సైతం అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. దీంతో దీనిపై పోరాటం చేయాలని బీజేపీ సంకల్పించింది. అందుకే సోము వీర్రాజు నేరుగా సీఎంకే లేఖరాశారు. విభజిత ఏపీ.. అంటే గత ఎనిమిదేళ్లుగా నెలకొన్న పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరారు. అంటే అటు చంద్రబాబుతో పాటు ఇటు జగన్ ను ఇరికించేందుకు వ్యూహాత్మకంగా సోము వీర్రాజు లేఖ రాశారు. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరీ..