Somu Veerraju: ఏదైతేనేమీ.. పవన్ కళ్యాణ్ చిరకాల వాంఛ తీరే సమయం వచ్చింది. తోడుగా బీజేపీ కలిసి వస్తోంది. ఇక సీఎం కుర్చీపై పవన్ కూర్చోవడమే ఆలస్యం అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. అధికార వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత.. అందిపుచ్చుకోలేని టీడీపీ ఆసహాయత.. మధ్యలో బలం పుంజుకుంటున్న జనసేన-బీజేపీ ల నడుమ ఏపీ రాజకీయాల్లో పొత్తు పొడుపులే కీలకంగా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన ఇప్పుడు కలుపుకోవాలనుకుంటున్న టీడీపీకి షాకింగ్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ చేసిన ప్రకటన ఇప్పుడు ఓ సంచలనంగా మారింది. మరి ఇది సాధ్యమవుతుందా? చంద్రబాబు ఏం చేస్తారన్న దానిపై స్పెషల్ ఫోకస్..
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి.. రసకందాయంలో పడ్డాయి. జనసేన 9వ ఆవిర్భావ సభా వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చేసింది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. అవసరమైతే ఎవరితోనైనా కలుస్తానని పవన్ చేసిన ప్రకటన టీడీపీకి ఊపిరిపోసింది. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు టీడీపీకి షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. ఏపీకి బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ఇదివరకే ప్రకటించిన సోము వీర్రాజు.. తాజాగా పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరించే పార్టీతోనే తాము పొత్తు పెట్టుకుంటామని.. తమ కూటమిలో చేర్చుకుంటామని సంచలన ప్రకటన చేశారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా ఓకే అంటేనే కూటమిలోకి ఆహ్వానిస్తామని లేదంటే తెగదెంపులే అంటూ టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు.
Also Read: కలిసి సాగితే బీజేపీ-జనసేనకు కలదు విజయం
దీన్ని బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం ఆశలకు ఆదిలోనే కళ్లెం వేశారు సోమువీర్రాజు.. జనసేన+బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీలో పోటీచేసి వైసీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకుందామనుకున్న చంద్రబాబుకు ఈ ప్రకటన శరాఘాతంగా మారింది. ఏపీలో బీజేపీ, జనసేనతో పోలిస్తే టీడీపీ పెద్ద పార్టీ. ఆ పార్టీ నేతనే సీఎం కావాలి. కానీ ఇప్పుడు సోమువీర్రాజు ప్రకటనతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. వైసీపీని ఓడించాలంటే టీడీపీకి కలిసి వస్తేనే సాధ్యం. టీడీపీ వస్తే ఆ పార్టీకి సీఎం సీటు ఉండదు. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఉత్కంఠగా మారింది. సీఎం సీటును త్యాగం చేస్తేనే టీడీపీకి మనుగడ.. కానీ అధికారం మాత్రం ప్రాప్తించదు. ఇలాంటి సంకట స్థితిలోకి టీడీపీని నెట్టి మంచి వ్యూహాన్ని ప్రదర్శించాడు సోము వీర్రాజు.
టీడీపీతో బీజేపీ+జనసేన పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో సోము వీర్రాజు ప్రకటన జనసైనికులకు పవన్ కు ఉత్సాహాన్నిచ్చింది. కానీ టీడీపీకి మాత్రం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. మూడు పార్టీలు పోటీచేస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఆ పార్టీ ఓడిపోతుంది. కానీ సోము ప్రకటనతో ఇప్పుడు టీడీపీ ఈ కూటమిలో చేరుతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. జగన్ కు అధికారం అప్పగించడమా? సీఎంగా పవన్ చేసి సపోర్టు చేయడమా? అన్నది ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఉంది. మరి ఆయన ఏం చేస్తారన్నది భవిష్యత్తులో తేలనుంది.
సోము వీర్రాజు అంతరంగం ఏదైనా కానీ ఇది పవన్ కు, బీజేపీకి కొండంత బలంగా మారింది. ఎందుకంటే సోము ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగానే ‘పవన్ ’ మా సీఎం క్యాండిడేట్ అని ప్రకటించారు. ఇప్పుడు పొత్తుల కోసం ఆశపడుతున్న టీడీపీని సోము వీర్రాజు డిఫెన్స్ లో పడేశారు. సోము పైకి పవన్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకోలేదని అంటున్నా లోలోపల అంతరంగం మాత్రం టీడీపీని ఇరుకునపెట్టడమేనని అంటున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి.. పంచాయితీ ఎక్కడిదాకా వెళ్తుందో?
Recommended Video: