Targeting Pavan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానంగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని తగిన సన్నహాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకొని పవన్ కల్యాణ్ పార్టీని గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

జనసైనికుల్లో జోష్ నింపేలా వరుసగా ప్రజా పోరాటాలను చేస్తూ పవన్ కల్యాణ్ దూకుడగా వెళుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, రోడ్ల సమస్యలపై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడుతోంది. అంతకముందు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అకాల వర్షాలు, తుఫానులతో నష్టపోయిన బాధితులకు జనసేన అండగా నిలిచి పోరాటాలు చేసింది.
ఈక్రమంలోనే జనసేనకు ఏపీలో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పలుచోట్ల గెలిచి సత్తా చాటారు. దీంతో ప్రజలు జనసేనను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. ఈమేరకు జనసేన సైతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే జనసేనాని ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు. అయితే ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడటం లేదు. పవన్ కల్యాణ్ తమతో పొత్తు పెట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడుతున్నారు.
పవన్ కల్యాణ్ కి ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రమే కనబడుతుందా? ప్రస్తుత, గత ప్రభుత్వాలు అమ్మిన ఆస్తులు కనబడటం లేదా అని నిలదీశారు. గత వారమంతా ఇదే ఇష్యూపై బీజేపీలో చర్చ నడిచింది. తాజాగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటాలు చేయాలని సోము వీర్రాజు చెబుతూ తమకు ఫుల్ టీ కావాలని.. హాఫ్ టీ వద్దన్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్.. అందులో టీ ఉండదనే ఉద్దేశ్యంతో సోమువీర్రాజు చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ తమ మిత్రపక్షమైన జనసేనపై పదేపదే విమర్శలు చేయడం వెనుక సోము వీర్రాజు ఉద్దేశ్యం ఏంటో మాత్రం తెలియడం లేదు.
గత కొద్దిరోజులుగా జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయా పార్టీలు మాత్రం తమ పొత్తు కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అయితే సోము వీర్రాజు పదేపదే జనసేనను టార్గెట్ చేయడం వెనుక అసలు కథే వేరే ఉందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే..!