Srikakulam Politics: రాజన్నొచ్చినాడు.. ఆడి అనుచరులొచ్చినారు.. ఒక్కసారి చూడండిరా నాయనా

గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కృషిచేసిన సీనియర్లు అక్కర్లేదు. పార్టీ కోసం పనిచేసిన కేడర్ అక్కర్లేదు అన్నట్టుంది ఆయన వ్యవహార శైలి. తనకంటూ ఓ నలుగురు కోటరీని పెట్టుకొని వారితోనే అన్నీ కానిచ్చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : June 20, 2023 3:47 pm

Srikakulam Politics

Follow us on

Srikakulam Politics: రాజన్న.. ఈ పేరుకో ఇమేజ్ ఉంది. ఒక వైబ్రేషన్ ఉంది. అందుకే నేటి తరం రాజకీయాల్లో ఈ పేరును తెగ వాడుకుంటున్నారు. తన సంక్షేమం, చక్కటి పాలనతో రాజశేఖర్ రెడ్డి ప్రజలకు రాజన్నగా మారారు. అందుకే రాజన్న రాజ్యం తెస్తానని వారసుడు జగన్ సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆయన సోదరి షర్మిళ సైతం రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వారితో రాజన్న జపం ఆగలేదు. వారిని అనుసరిస్తున్న వారు రాజన్న అంటూ పేరు పెట్టుకుంటున్నారు. ప్రైవేటు ఆర్మీని పెట్టుకొని తాను రాజన్నను అంటూ ఎవరికి వారే కొందరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక యువ ప్రజాప్రతినిధి సైతం తనకు తాను రాజన్న అని పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు చివరిలో రాజు ఉండడంతో ముచ్చటపడి మహా నేత పేరును అతికించుకున్నారు. అంతటితో ఆగకుండా అదే పేరుతో ఓ యువసేనను నడుపుతున్నారు. ఓ సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటుచేశారు. ఇంకేముంది ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ సీనియర్లు, అనుబంధ విభాగాలతో వీరికి పనిలేదు. ఎక్కడ చూసినా యువసేన, సోషల్ మీడియా ప్రతినిధులదే హవా. వారితోనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని సదరు యువ కీలక ప్రజాప్రతినిధి చూస్తున్నారు.

గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కృషిచేసిన సీనియర్లు అక్కర్లేదు. పార్టీ కోసం పనిచేసిన కేడర్ అక్కర్లేదు అన్నట్టుంది ఆయన వ్యవహార శైలి. తనకంటూ ఓ నలుగురు కోటరీని పెట్టుకొని వారితోనే అన్నీ కానిచ్చేస్తున్నారు. ఇదే అదునుగా ఆ నలుగురు రెచ్చిపోతున్నారు. సమస్య సృష్టించేది వారే. ఆ సమస్యను జఠిలం చేసేది వారే. సెటిల్మెంట్ చేసేది వారే. అంతిమంగా బాధితుడి కంటే ఎక్కువ లబ్ధి పొందేది వారే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ రూపంలో కప్పం ఆ యువ కీలక ప్రజాప్రతినిధిదేనని సిక్కోలు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది.

అందుకే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో రాజన్న వచ్చినా.. ఆయన అనుచరులు వచ్చినా జనం ముఖం చాటేస్తున్నారు. ప్రతి గ్రామంలో సొంత పార్టీ వారే గైర్హాజరవుతున్నారు. ఈ రాజన్నను, ఆయన అనుచరులను భరించలేమని తేల్చిచెబుతున్నారు. నవంబరు వరకూ అన్ని పనులు చక్కబెట్టుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అంటే పార్టీకి గుడ్ బై అన్నమాట. రాజన్న పేరు పెట్టుకోవడం తప్పులేదు. కానీ రాజన్నపేరును చెడగొట్టే విధంగా సదరు యువ కీలక ప్రజాప్రతినిధి వ్యవహార శైలి ఉందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. హైకమాండ్ కు కూడా ఇటువంటి ఫిర్యాదులే ఉన్నట్టు తెలుస్తోంది.