Smita Sabharwal: స్మితా సబర్వాల్.. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సెక్రటేరియట్లో కీలకంగా వ్యవహరించిన అధికారి. ముఖ్యంగా సీఎంవో అధికారిగా, ముఖ్యమంత్రి సెక్రటరీగా, మిషన్ భగీరథ పథకానికి కీలక అధికారిగా ఆమె పని చేశారు. అప్పట్లో ఆమె వ్యవహార శైలి పై చాలా విమర్శలు వచ్చాయి. ఓ న్యూస్ మ్యాగజైన్ పై లీగల్ పోరాటానికి సంబంధించి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె కంటే ఎక్కువ సీనియార్టీ అధికారులు ఉన్నప్పటికీ.. స్మితకు కీలకమైన పోస్టులు ఇవ్వడం పట్ల.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మరోవైపు స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసే రీల్స్ పై కూడా రకరకాల విమర్శలు వినిపించేవి. అయినప్పటికీ ఆమె తన ధోరణి అలానే కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అప్రాధాన్య పోస్టులోకి పంపించారు.
గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న ఆమెకు ఇప్పుడు పెద్దగా పని లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆమెను కొన్ని న్యూస్ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించారు..”నేను ఎవరికీ భయపడను.. నాకు దేవుడు భయం అనేది ఇవ్వడం మర్చిపోయారేమో. నా డీఎన్ఏ లో కూడా భయం అనేది లేదు. నిఖార్సైన అధికారిగా పనిచేశాను. ప్రజల్లో నాకు గుర్తింపు ఉంది.. అలాంటప్పుడు నేనెవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. నా పని నేను చేసుకుంటా. నా దారిలో నేను వెళ్తా. నా జోలికి వస్తే ఊరుకోనంటూ” స్మిత వ్యాఖ్యానించారు. తనకు ఉన్న అర్హతల ఆధారంగానే బాధ్యతలు ఇచ్చారని, నేను ఎవరినీ నాకిది కావాలని అడగలేదని స్మిత స్పష్టం చేశారు.
ఇక మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు ఎందుకు అనే.. ప్రశ్నకు.. స్మిత తనదైన శైలిలో సమాధానం చెప్పారు..”నాకు 47 సంవత్సరాలు. భర్త, పిల్లలు ఉన్నారు. ఈ వయసులో కూడా నేను ఎలా కూర్చోవాలో ఒకరు చెబితే నేర్చుకోవాలా? ఆ స్టేజ్లో నేను లేను కదా? నా కాలు మీద నా కాలే వేసుకొని కూర్చున్నాను. ఇందులో తప్పేముంది? దీనిపై కూడా రాద్ధాంతం చేస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయినా దీన్ని కూడా అలా ఎలా చూస్తారంటూ” స్మితా సబర్వాల్ వ్యాఖ్యానించారు.. కాగా, స్మితా సబర్వాల్ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ.. ప్రతి విషయాన్ని నిబంధనల ప్రకారమే చేశామని.. ఎక్కడా కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయలేదని స్పష్టం చేశారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంపై స్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.