Nalgonda Rajagattu Revenue: ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు.. దానికి తగ్గట్టు అలవెన్స్లు, పైగా ప్రత్యేక వాహనాలు.. ఇన్ని సమకూర్చినా వక్రబుద్ధి మారడం లేదు. తీసుకుంటున్న జీతానికి సక్రమంగా పని చేయాల్సింది పోయి.. ప్రభుత్వ భూములకే ఎసరు పెడుతున్నారు. దీనివల్ల విలువైన సర్కారు భూమి అక్రమార్కుల పరం అవుతోంది. తాజాగా నల్గొండ జిల్లాలో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేందుకు రెవెన్యూ శాఖలో ఒక కీలక అధికారి చక్రం తిప్పారు. ఇందుకు సంబంధించిన అన్ని దస్త్రాలను సిద్ధం చేశారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు.. ఆయన ప్లాన్ మధ్యలోనే బెడిసి కొట్టింది.

_ఇంతకీ ఏం జరిగిందంటే
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాజగట్టు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 826లో భూములను నాగార్జునసాగర్ నిర్వాసిత గ్రామాలయిన పెద్ద అడిశర్లపల్లి మండలం చిన్న గుమ్మడం, పెద్ద గుమ్మడం వాసులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇది జరిగి కూడా 50 సంవత్సరాలు కావస్తోంది. అయితే అప్పట్లో ఆ భూముల్లో దట్టమైన వృక్షాలు ఉండడంతో నిర్వాసితులు అందులోకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆ భూములను స్థానికంగా నివాసం ఉంటే గిరిజనులకు డీ ఫాం పట్టాలు ( డీస్ రిజర్వ్డ్) ఇచ్చింది. అయితే ఈ భూమిపై ఎప్పటినుంచో కన్ను వేసిన ఓ రెవెన్యూ అధికారి ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేందుకు దస్త్రం తయారు చేశారు. దీనిని జిల్లా స్థాయి ఆమోదానికి తీసుకెళ్లారు. కానీ ఆయన కొద్ది రోజులకే బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో మరో అధికారి రాగా.. ఆయన దృష్టికీ ఈ దస్త్రం వెళ్ళింది. అయితే దీని పూర్వపరాలు పరిశీలించిన ఆయన సదరు అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా బదిలీ కావడంతో వేరే అధికారి వచ్చారు. అయితే ఈసారి ఆ అధికారి వద్దకు ఆ రెవెన్యూ అధికారి దస్త్రం తీసుకెళ్లగా తిరస్కరించారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరం ధర 15 లక్షలు గా ఉంది. ఈ లెక్కన 160 ఎకరాల విలువ 24 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు సదరు కంపెనీతో ఆ రెవెన్యూ అధికారికి ఒప్పందం కుదిరిందని, ఇది చేసి పెట్టినందుకు గాను మూడు కోట్లు ఇచ్చేలా మాట్లాడుకున్నారని విశ్వసనీయ సమాచారం. అక్రమ సంపాదనలో ఆరితేరిన ఆ రెవెన్యూ అధికారి ఆ కంపెనీ నుంచి మూడు కోట్లను ఇప్పటికే తీసుకున్నారని ఆ శాఖ ఉద్యోగులు అంటున్నారు.

– తప్పుడు పత్రాలు సృష్టించారు
వాస్తవానికి సర్వేనెంబర్ 826 లో మొత్తం 1,097 ఎకరాల భూమి ఉంది. ఇందులో 776 ఎకరాలు డిస్ రిజర్వ్ డ్ జాబితాలో ఉన్నాయి. 108.90 ఎకరాలను ధరణిలో ఇతర రైతుల పేర్లపై నమోదు చేశారు. మరోవైపు డిస్ రిజర్వ్ జాబితాలో ఉన్న భూములను దక్కించుకునేందుకు సుమారు 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సర్వే నెంబర్ లోని 160 ఎకరాలను ఓ కంపెనీకి కట్టబెట్టేందుకు ఆ రెవెన్యూ అధికారి తప్పుడు పత్రాలను సృష్టించారు. ఆ భూములను ఓ క్రోమైట్స్ కంపెనీ మరో కంపెనీ నుంచి కొనుగోలు చేసిందని తప్పుడు పత్రాలు సృష్టించారు. ఈ పాచిక పారకపోవడంతో హైదరాబాదులోని ఓ స్టిల్స్ కంపెనీ భూములు కొనుగోలు చేసిందని మరో తరహా పత్రాలు సృష్టించారు. అయితే ఈ స్టీల్స్ కంపెనీ సదరు రెవెన్యూ అధికారి బంధువులకు చెందినది కావడం గమనార్హం. అయితే ఈ స్టీల్స్ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇవ్వాలని కోరగా.. అందుకు తహసిల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఒప్పుకోలేదు. దీంతో వారిని సదరు అధికారి బదిలీ చేయించారని సమాచారం. వ్యాపారులతో అంటకాగే ఈ అధికారి ఇదే సర్వే నెంబర్ లోని 100 ఎకరాలను నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో ఓ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకుగాను ఆ కంపెనీ నుంచి భారీగానే ప్రతిఫలం ముట్టింది. అయితే సదరు అధికారి వ్యవహారం వెలుగులోకి రావడంతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ నిర్వహిస్తున్నారు.
_ బుద్ధి మారదా
రెండు సంవత్సరాల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ అధికారి ఉదంతాన్ని చూసైనా ఆ శాఖ అధికారులు మారడం లేదు. రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేయాలని ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. వీఆర్ఏలను పక్కన పెట్టి, వీఆర్వోలకు ఇతర శాఖలో విధులు కేటాయించినా రెవెన్యూ శాఖ పనితీరులో మార్పు రావడం లేదు. ఇప్పటికీ ధరణి పోర్టల్ కొరకరాని కొయ్యగా మారింది అంటే దానికి కారణం రెవెన్యూ అధికారులే. ఏసిబి ఏటా నిర్వహించే దాడుల్లో అధికంగా పట్టుబడుతోంది రెవెన్యూ అధికారులే. అయినప్పటికీ వారి పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న తీరుగా ఉంటున్నది వారి వ్యవహారం.
Also Read: Mahesh Babu`s Mother Death: మహేష్ బాబు కుటుంబంలో ఒకే ఏడాదిలో రెండు విషాదాలు
[…] […]
[…] […]