Varalaxmi Sarathkumar: నాంది సినిమా చూశారా? పోనీ తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.. ఈ రెండు సినిమాల్లో ఒకటి పాజిటివ్ రోల్. ఇంకొకటి నెగిటివ్ రోల్. రెండు పాత్రలు చేసింది తనే. కానీ ఎక్కడ కూడా తను కనపడదు. పాత్ర మాత్రమే ప్రేక్షకుల ముందు కదలాడుతుంది. పుట్టింది తమిళనాడులో అయినా.. తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ముంబై నుంచి వచ్చి కోట్లల్లో పారితోషికాలు తీసుకొని, కనీసం డబ్బింగ్ చెప్పుకోవాలనే సోయి కూడా లేని తెల్ల తోలు హీరోయిన్ల కన్నా ఈమె కోటి పాళ్ళు నయం! ఇంత ఉపోద్ఘాతం ఆమె గురించి ఎందుకు చెప్తున్నామంటే.. ఒకటి, రెండు సినిమా అవకాశాల కోసం నానా గడ్డి కరిచే హీరో హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో.. ఈమె చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. అది కూడా అన్ని ఉడ్ లలో కలిపి!

_ తండ్రి పేరుతో వచ్చినా
వరలక్ష్మి శరత్ కుమార్.. తమిళ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తె. ఆమె సినిమాల్లోకి వస్తానంటే తండ్రి అడ్డుపడ్డాడు. తర్వాత ఆయనకు తప్పలేదు. సినిమాల్లో అందానికే ఫస్ట్ ప్రయారిటీ! నటన, తొక్క, తోలు అన్ని తర్వాతే! ఇవేం ఎన్టీఆర్, ఎస్వీఆర్ రోజులు కావు కదా! కాస్టింగ్ కౌచ్ ఎలాగూ ఉంది! ఏ “మీ టూ” ఉద్యమం దాన్ని ఆపింది గనుక! వరలక్ష్మి విషయానికొస్తే ఆమె పెద్ద అందగత్తె కాదు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే అంతంత మాత్రమే. ఒబేస్ అనిపించదు గాని కాస్త పుష్టిగా మాత్రం కనిపిస్తుంది. నచ్చింది తింటుంది. అలాగని ప్రొడ్యూసర్ల దగ్గర ముక్కు పిండి వసూలు చేసే రకం కాదు. ఆ మధ్య హీరో విశాల్ తో సంథింగ్ సంథింగ్ నడిచినట్టు కోలీవుడ్ కోడై కూసింది. ఆ తర్వాత చప్పున చల్లారింది. గ్లామర్ ఫీల్డ్ లో ఇవన్నీ కామనే! ఎంత త్వరగా పుడతాయో, అంత త్వరగా కాలగర్భంలో కలిసిపోతాయి. వరలక్ష్మి దగ్గర జీరో సైజులు చెల్లవు. డ్యాన్సులు, అందాల ఆరబోతకు తాను రెడీ. కొన్ని సినిమాల్లో బోల్డ్ గా చేసింది. మరి అతిగా కాదు. అసలే శరత్ కుమార్ బిడ్డ. టెంపర్ మెంట్ విషయంలో అస్సలు తగ్గదు. అందుకేనేమో ఎక్స్పోజింగ్ అడిగే సాహసం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఇంత చెప్పి తాను ఏమన్నా యంగ్ చార్మింగా అంటే కాదు. ఇప్పటికే ఆమెకు 37 ఏళ్ల వయసు వచ్చింది. వెటరన్ నటీమణులు త్రిష, శ్రియా శరణ్ కంటే ఏడాదో, రెండేళ్ళో అంతే తేడా!
Also Read: Mahesh Babu`s Mother Death: మహేష్ బాబు కుటుంబంలో ఒకే ఏడాదిలో రెండు విషాదాలు
– పాత్ర కోసం బాగానే కష్టపడుతుంది
వరలక్ష్మి శరత్ కుమార్ గొప్ప నటి అని చెప్పలేం గానీ.. పాత్ర కోసం బాగానే కష్టపడుతుంది. గొప్పగా పేరు తెచ్చిపెట్టిన పాత్రలు పడలేదు. అవార్డులు కూడా తక్కువే సంపాదించింది. వాటిపై ధ్యాస కూడా లేదని ఆమె పలుమార్లు చెప్పింది. ఇప్పటికీ తాను సినీ రంగ ప్రవేశం చేసి పది ఏళ్లు గడిచిపోయాయి. ఆమె ప్రవేశానికి శరత్ కుమార్ పేరు పని చేసిందేమో గాని.. తర్వాత ఆమె స్థిరంగా నిలబడింది. ఇప్పుడు ఆమె ఎంత బిజీ అంటే.. ఊపిరి కూడా తీసుకోలేనంతగా.. ఎందుకంటే ఇప్పుడు ఆమె చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. అసలు ఒక్కో ఛాన్స్ కోసం హీరో హీరోయిన్లు మేనేజర్లతో, రకరకాల ఫోటోషూట్లతో నిర్మాతలను టెంప్ట్ చేస్తున్న రోజులు ఇవి. కొలతలతోనే సినిమా అవకాశాలు ఇచ్చే అన్ని పరిశ్రమలు ఇప్పుడు ఈమె ముందు జి హుజూర్ అంటున్నాయి. ఏకంగా అన్ని సినీ పరిశ్రమలు కలిసి 8 సినిమాలను ఈమె చేతిలో పెట్టాయి. సాదాసీదా అందంతో, పుష్టికరమైన శరీరంతో, నాలుగో పదిలోకి సమీపిస్తున్న వయసుతో సినీ అవకాశాలను భలేగా ఒడిసిపడుతున్నది. సాధారణంగా వారస హీరోలు అతి కష్టం మీద క్లిక్ అవుతారు. అందరూ ఐకాన్ స్టార్ బన్నీలు కాలేరు. కానీ వారస హీరోయిన్లు చాలా చాలా తక్కువ మంది క్లిక్ అవుతారు. కొన్ని కుటుంబాల్లో అయితే తెరమీదకే రానివ్వరు. అలాంటి వారితో పోలిస్తే వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని కోట్ల రెట్లు నయం.

_ పాత్రలు ఏవైనా సరే
తండ్రి శరత్ కుమార్ తమిళ పరిశ్రమను ఒకప్పుడు ఒక ఊపు ఊపాడు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యమ బిజీ. అటువంటి నటుడి కూతురు చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు సినిమా చేస్తానని చెబుతుందంటే నమ్ముతారా? వరలక్ష్మి విషయంలో మాత్రం కచ్చితంగా నమ్మాలి. లీడ్ రోల్ మాత్రమే కావాలనేమీ లేదు. చిన్న రోల్ అయినా రెడీ! నటన పట్ల ఆమెకున్న అంకితభావం అటువంటిది మరి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఏ భాష అయినా సరే! పెద్ద హీరోనా, చిన్న హీరోనా.. పెద్దగా లెక్క చేయదు. ఆమె లెక్కల ప్రకారం హీరో పక్కనే చేయాలని రూల్ కూడా పెట్టుకోదు. కాస్త చెప్పుకోదగిన పాత్ర అయితే చాలు. అందుకే అంతటి కరోనా సంక్షోభంలో కూడా ఆమె సినిమా ఛాన్స్ లకు డోకా లేదు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ కు సమంత మెయిన్ రోల్లో నటిస్తున్న యశోద సినిమాలో మంచి పాత్ర పడింది. ఇది సమంతకు దీటుగా ఉంటుందని ఆ సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చెబుతున్నారు. ఈమధ్య శబరి అనే సినిమా కూడా ప్రారంభమైంది.

ఈ సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుందట. పంబన్, పిరంతై పరాశక్తి, కలర్స్, లగామ్, హనుమాన్, బాలకృష్ణతో ఓ సినిమా.. ఇప్పుడు ఇవీ వరలక్ష్మి చేతిలో ఉన్న ప్రాజెక్టులు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె పర్సనల్ లైఫ్ కొంచెం డిఫరెంట్. ఆ మధ్య విశాల్ తో లవ్ ట్రాక్ నడిచినట్టు వార్తలు వచ్చాయి. నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ కు, విశాల్ కు వైరం నడిచింది. అప్పుడే ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని కోలీవుడ్ వర్గాల బోగట్టా. ఆ తర్వాత విశాల్ హైదరాబాదుకు చెందిన ఓ యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అప్పుడే తాను జీవితంలో పెళ్లి చేసుకోనని వరలక్ష్మి తేల్చి చెప్పేసింది. ముందే చెప్పుకున్నాం కదా శరత్ కుమార్ కూతురు కనుక ఆ టెంపర్ మెంట్ ఉంటుందని.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ చూపించింది. ఇంతకీ ఇది విశాల్ కు అర్థమైందో లేదో!
Also Read: Jabardasth : జబర్ధస్త్ కమెడియన్ మృతి.. విషాదంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను
[…] Also Read: Varalaxmi Sarathkumar: తండ్రి పేరుతోనే పరిశ్రమలోకి… […]