Gaddar : ప్రజాయుద్ధనౌక, గాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో విషాదం నెలకొంది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన గద్దర్ సన్నిహితుడు, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. ఆత్మీయుడు దూరమవుతున్న విషయం తట్టుకోలేకనే జహీరుద్దీన్ గుండె ఆగిపోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
గద్దర్‌కు సన్నిహితుడు..
గద్దర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే జహీరుద్దీన్ అలీఖాన్.. సోమవారం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ ఇంటి వరకు సాగిన యాత్రలో ఆయన కూడా ఉన్నారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఊపిరాడకపోవడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు జహీరుద్దీన్ అలీ ఖాన్.
మిత్రమా నీవెంటనే నేను..
ఆత్మీయ మిత్రుడు గద్దర్ మరణంతో జహీరుద్దీన్ కలత చెందాడని స్థానికులు, ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గద్దర్ మరణ వార్త విన్నప్పటి నుంచి భావోద్వేగంతో కనిపించాడని పేర్కొన్నారు. చివరి చూపు వరకు గద్దర్ వెంటే ఉండాలని మతం వేరైనా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చాడని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 16 కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడు. మహా బోధి స్కూల్ వద్ద జరిగిన తోపులాటలో అప్పటికే నలతగాఉన్న జహీరుద్దీన్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మిత్రమా.. నీవెంటే నేను అన్నట్లుగా గద్దర్ మరణం తట్టుకోలేకనే జహీరుద్దీన్ అలీఖాన్ మృతిచెందాడని స్థానికులు తెలిపారు.