Gaddar : మధుప్రియ.. పరిచయం అక్కరలేని పేరు. ఆరేళ్ల వయసులో ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనమ్మా.. అనే పాటలతో ఒక సంచలనం అయిన మధుప్రియ. గద్దర్ స్ఫూర్తితో.. గద్దర్ ప్రోత్సాహంతో నేడు గొప్ప గాయినిగా ఎదిగింది మధు ప్రియ. తాను తాతా అని పిలిచే గద్దర్ మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. తన ఎదుగుదలలో అమ్మానాన్న తర్వాత గద్దర్ తాతే అని చెబుతూ భావోద్వేగానికి లోనైంది.
ఆరేళ్ల వయసు నుంచి అనుబంధం..
మధుప్రియకు గద్దర్‌తో ఆరేళ్ల వయసు నుంచి అనుబంధం ఉంది. గోదావరిఖనిలో సింగరేణి కార్మిక సంఘాలు నిర్వహించిన సమావేశానికి గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి కార్మికుడు అయిన మధుప్రియ తండ్రి ఈ మీటింగ్‌కు కూతురుతో వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడి నాయకుల సహకారంతో ఆరేళ్ల వయసున్న తన కూతురును గద్దర్‌కు పరిచయం చేశాడు. వేదికపై గద్దర్‌తో ఎలాంటి జంకు లేకుండా మాట్లాడడంతో మురిసిపోయారు గద్దర్. వెంటనే పాట పాడతావా అని అడిగాడు. ఓ పాడతా అని ధైర్యంగా చప్పిన మధుప్రియ.. అమ్మ దగ్గర నేర్చుకున్న ఆడపిల్లనమ్మా.. నేను అడపిల్లను.. అనే పాట పాడి అందరి హృదయాలను తట్టింది.
శిష్యురాలిగా మారిపోయి..
నాటి నుంచి మధుప్రియ గద్దర్ శిష్యురాలిగా మారిపోయింది. ముద్దుగా తాతా అని పిలుస్తూ గద్దర్ పాల్గొన్న అనేక సమావేశాల్లో పాల్గొని పాటలు పాడింది. అయితే గద్దర్ ఎన్నడూ ఆమె చదువుకు ఆటంకం కలుగకూడాదని భావించేవాడట. బాగా చదువుకోవాలని సూచించేవాడట. ఈ విషయాన్ని మధుప్రియ స్వయంగా తెలిపింది.
తెలంగాణ ఉద్యమంలో..
తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌తో గొంతు కలిపింది మధుప్రియ. కాలికి గజ్జకట్టి.. గద్దర్‌తో ధూంధాం కార్యక్రమాల్లో ఆడింది. తెలంగాణ ప్రజలను చైతన్యపర్చడంలో, ఉద్యమానికి ఊపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.
కడసారి చూసి కన్నీటి పర్యంతం..
గద్దర్ మరణ వార్త తెలుసుకున్న మధుప్రియ కడసారి తాతను చూసుకునేందుకు వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైంది. నెలన్నర క్రితం తాతను కలిశానని చెప్పింది. గద్దర్ లాంటి వ్యక్తి ఇక పుట్టడని తెలిసింది. తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. గద్దర్ మరణించిన రోజు ఎర్రజెండా.. కళ, ప్రకృతి, అడవితల్లి, కాలిగజ్జ, భుజాన వేసుకునే గొంగడి కన్నీరు పెట్టే రోజు అని తెలిపింది. తన ఉన్నతని గద్దర్ తాత ప్రతీక్షణం కాక్షించాడని చెపిపంది. మొన్న సాయి చంద్, నేడు గద్దర్ తాత మరణం కళాకారులకు తీరని లోటని పేర్కొంది.