
దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచిస్తుంది. పోలీసులు ఎంత చెప్పిన కొందరు మాత్రం తామకేమీ పట్టనట్లుగా బయట తిరుగుతున్నారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్న కొందరు పాటించడం లేదు. బయటికి వెళితే ఏం జరుగుతుందనేది ఓ బార్బర్ షాపు ఉదాంతం తెలియజేసింది. లాక్డౌన్ సమయంలో హెయిర్ కటింగ్ వెళ్లి ఆరుగురు వ్యక్తులు కరోనా అంటించుకున్న వైనం తాజాగా వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్లోని ఖర్గావ్ జిల్లాలోని బార్గావ్ గ్రామంలో కొంతమంది వ్యక్తులు హెయిర్ కటింగ్ కోసం బార్బర్ షాపుకు వెళ్లారు. కటింగ్ షాపు యజమాని ఎప్పటిలాగే ఒకే టవల్ ఉపయోగించింది వారికి కటింగ్ చేశాడు. ఈ సంఘటన ఆరుగురు వ్యక్తులకు కరోనా సోకడానికి కారణమైంది. అదేలా అంటే.. ఇండోర్ కు చెందిన లాక్డౌన్ వల్ల తన స్వగ్రామానికి వచ్చాడు. ఏప్రిల్ 5న ఆ వ్యక్తి బార్బర్ షాపు వెళ్లి కటింగ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్యులు టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ విషయం తెలియని బార్బర్ కరోనా వ్యక్తికి వాడిన టవల్ నే తన కటింగ్ షాపుకు వచ్చిన 12మందికి ఉపయోగించాడు. తాజాగా వీరిందరికీ టెస్టులు నిర్వహించగా ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కటింగ్ చేసిన బార్బర్ మాత్రం కరోనా నెగిటివ్ రావడం విశేషం. ఇప్పటికైనా ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.