MP Ganeshamurthy: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఓ సిట్టింగ్ ఎంపీకి టికెట్ దక్కకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్ పార్లమెంట్ స్థానానికి ఎం డీఎంకే పార్టీ నేత గణేశమూర్తి (77) లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఈ స్థానంలో విజయం సాధించారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. కోయంబత్తూరు ప్రాంతంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుముశారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే, ఎం డీఎంకే పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా ఈ రోడ్ స్థానాన్ని ఎం డీఎంకే దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి గణేశమూర్తి “ఉదయించే సూర్యుడు” డీఎంకే గుర్తుపై పోటీ చేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈరోడ్ డీఎంకేకు వెళ్ళింది. పొత్తుల్లో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి స్థానాన్ని కేటాయించారు. ఆ స్థానంలో దురైవైగో ను ఎండీఎంకే పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేష్ మూర్తి ఆందోళనకు గురయ్యారు.
టికెట్ రాదని తెలిసి తన అనుచరులతో భేటీ అయ్యారు. వారి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. మార్చి 24న ఆయన ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. విషమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. గురువారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గణేష్ మూర్తి 1947 జూన్ లో జన్మించారు. 1993లో ఎండీఎంకే పార్టీని ప్రారంభించి నాటి నుంచి ఆయన అందులోనే కొనసాగుతున్నారు. 1998లో తొలిసారిగా పళని పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఈరోడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2016లో ఎండీఎంకే కోశాధికారిగా కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో ఈరోడ్ స్థానం నుంచి ఎండీఎంకే అభ్యర్థిగా రెండు లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన కన్నుమూయడంతో తమిళనాడులో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రతిపక్ష బీజేపీ, అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీ వ్యవహార శైలి పట్ల విమర్శలు గుప్పిస్తున్నాయి.