CV Anand- KCR: అజిత్ దోవల్ మోదీకి ఇష్టుడు. అందుకే హోంశాఖ వ్యవహారాలు అతడి కన్నుసన్నల్లో ఉంటాయి. చివరికి అమిత్ షాక్ కూడా తెలియని విషయాలు ఇద్దరి మధ్య సాగుతూ ఉంటాయి. ఇక జై శంకర్ ఒకప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి ఇప్పుడు దేశ విదేశాంగ శాఖ మంత్రి. మోడీ కాంపౌండ్ లో అత్యంత కీలకమైన వ్యక్తి. మోడీకి అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఇక తెలంగాణ విషయానికొస్తే కెసిఆర్ కాంపౌండ్ లో స్మితా సబర్వాల్, అంజని కుమార్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులు ముఖ్యులు. స్మితా సబర్వాల్, ప్రాజెక్టులు గట్రా చూసుకుంటుంది. అంజని కుమార్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. మహేందర్ రెడ్డి పదవి విరమణ అనంతరం అంజని కుమార్ ను డిజిపిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక వీరంతా కూడా ఎప్పటి నుంచే కేసీఆర్ కు నమ్మిన బంట్లలాగా పనిచేస్తున్నారు. అయితే వీరిలో సివి ఆనంద్ కు కేసిఆర్ కు మధ్య వేవ్ లెంగ్త్ చాలా దగ్గరగా ఉంటుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు యాక్సెస్ ఉన్న అతి కొద్ది మంది అధికారుల్లో సీవీ ఆనంద్ ఒకడు. అందుకే ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో స్టీఫెన్ రవీంద్రను కాదని ఆనంద్ కు సిట్ బాధ్యతలు అప్పగించారు. స్టీఫెన్ రవీంద్ర బాగా చేయడు అని కాదు. అన్నం, బిర్యానీ పక్క పక్కనుంటే మన చేయి ఆటో మేటిక్ గా బిర్యానీ వైపే వెళుతుంది. సో ఇది కూడా అలాంటిదే. కెసిఆర్ పూర్తి అధికారాలు ఇవ్వడంతో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది.

సివిల్ సప్లై కేసులో..
అప్పట్లో రైస్ మిల్లర్లు కుమ్మక్కయి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బయట మార్కెట్ కు తరలించారు. ఇది సంచలనం సృష్టించడంతో ఈ కేసు పరిష్కార బాధ్యత కేసిఆర్ ఆనంద్ కు అప్పగించారు. అప్పట్లో ఆనంద్ విచారణ నిర్వహించి దీనిపై నివేదికను కెసిఆర్ కు అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ కేసు చప్పున చల్లారిపోయింది. అయితే ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు ఉండటంవల్లే కెసిఆర్ ఈ కేసును పక్కన పెట్టారని సమాచారం.
సివి ఆనంద్ అవసరం వచ్చింది
ఆ తర్వాత ఎందుకనో కెసిఆర్ ఆనంద్ ను పక్కన పెట్టారు. అయితే హైదరాబాదులో డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు కెసిఆర్ అకున్ సబర్వాల్ ను రంగంలోకి దింపారు. ఆయన కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడంతో కెసిఆర్ కొంప మునిగే ఆధారాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆయన ఆ నివేదికను కోల్డ్ స్టోరేజీ లోకి పంపారు. ఆకున్ సబర్వాల్ ను కూడా పక్కన పెట్టారు. తీవ్ర మదనం తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఆనంద్ ను తీసుకున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ పబ్ లో డ్రగ్స్ కలకలం చెల రేగడంతో మళ్లీ ఆనంద్ రంగంలోకి దిగారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో కీలక నిందితుడు ఆయన ఎడ్విన్ ను అరెస్ట్ చేశారు. అది కూడా గోవా వెళ్లి.

మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు లోనూ..
ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిగా సివి ఆనంద్ నియమితులయ్యారు.. ఈ కేసులో మరింతమంది పేర్లు బయటపడుతున్న నేపథ్యంలో విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ నెట్వర్క్ పై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే ఢిల్లీ, ఫరిదాబాద్, కేరళ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు విమాన టికెట్ జాతీయ పార్టీకి చెందిన నాయకుడి బంధువు బుక్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఫామ్హౌస్ డీల్ జరిగిన రోజు కారులో ఓ బ్యాగ్ కు విమాన బోర్డింగ్ పాస్ కు సంబంధించిన స్టిక్కర్ గుర్తించారు. ఈ కేసు కు సంబంధించి న్యాయ నిపుణుల బృందంతో సివి ఆనంద్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. రోగి కోరింది పెరుగన్నమే.. డాక్టర్ తినమని చెప్పింది పెరుగన్నమే అనే సామెత తీరుగా.. ఇప్పుడు కెసిఆర్ కోరుకున్నట్టుగానే సివి ఆనంద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగానే చెప్పుకున్నట్టు నరేంద్ర మోడీకి అజిత్ దోవల్.. కేసీఆర్ కు సీవీ ఆనంద్.. కొన్ని కొన్ని వేవ్ లెంగ్త్ లు అలా కుదురుతాయి అంతే!