Amit Shah vs KCR: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ, ఈడీ దాడులతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కేసీఆర్ ఏకంగా బీజేపీలో నంబర్ 2 అయిన అమిత్ షానే టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలో అమిత్ షా పేరు ప్రస్తావనకు రావడంతో దాన్ని బేసుకొని ఏకంగా నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కేంద్రంలోని బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనుక తెలంగాణ సిట్ నోటీసు ఇస్తే అది దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. దేశం ఫోకస్ అంతా తెలంగాణ వైపు మరలుతుంది. బీజేపీని అవినీతి కోణంలో చూపించే మహా అవకాశం తమకు దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

కేసీఆర్ వెనుకుండి నడిపిస్తుండడంతో తెలంగాణ సిట్ ఎక్కడా తగ్గకూడదని తెలుస్తోంది. కేసీఆర్ కు ఎంతో దగ్గరైన సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సిట్ కు ఇన్ చార్జి కావడంతో దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా కీలక నేతలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సిట్ ఇప్పుడు ఏకంగా అమిత్ షాకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చిక్కిన ముగ్గురి ఫోన్ రికార్డులు.. వారు మాట్లాడిన సందర్భాల్లో అమిత్ షా పేరు వచ్చింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో 9 మందికి నోటీసులు జారీ చేశారని.. తాజాగా అమిత్ షాను ఇందులోకి లాగాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక వీరే కాదు.. ఆర్ఎస్ఎస్ లో నంబర్ 2 అయిన దత్తాత్రేయ హోస్బలే.. హోంమంత్రి అమిత్ షా ప్రైవేటు కార్యదర్శి సాకేత్ కుమార్ కూడా ఉన్నట్టు తెలిసింది.
ఈ మొత్తం వ్యవహారంలో రామచంద్రభారతి కీలకంగా ఉన్నారు. అమిత్ షా కార్యదర్శికి రామచంద్రభారతి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపాడని పోలీసులు గుర్తించారు. దీంతో అమిత్ షాకు ఈ కేసుకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని.. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు సంకేతాలు ఇస్తున్నారు. పోలీస్ బాస్ అయిన అమిత్ షాకే నోటీసులు ఇస్తే అది దేశవ్యాప్తంగా పెను సంచలనం అవుతుంది.

ఇక కేవలం కాల్ రికార్డులను పట్టుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నోటీసులు ఇస్తే ఈ కేసు నిలబడదని అందరూ అంటున్నారు. సో దీనిపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మరి ఏకంగా కేంద్ర హోంమంత్రికి నోటీసులు ఇస్తే బీజేపీ అగ్ర నాయకత్వం ఎలా సహిస్తుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ అంశాన్ని వారు సీరియస్ గా తీసుకొని టీఆర్ఎస్ సర్కార్ ను షేక్ చేసే నిర్ణయాలు అమలు చేసే అవకాశాలు ఉంటాయి.