ఆ అధికారులపై దూకుడు పెంచిన ‘సిట్’..!

అమరావతి రాజధాని భూ సమీకరణలో గత ప్రభుత్వం టీడీపీ నేతలకు అనుచిత లబ్ది చేకూరేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అందులో భాగంగా సిట్ ను ఏర్పాటు చేసి కొంతమంది అధికారుల అరెస్టులకు దిగింది. అంతే కాకుండా ఈ అంశంపై మరింత దూకుడుగా వెళ్లి టీడీపీకి అనుకూలంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, రాజకీయ ప్రత్యర్థి పార్టీపైనా పై చేయి సాధించాలనే ఉద్దేశంతో దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రపంచంలోనే తొలిసారి […]

Written By: Neelambaram, Updated On : June 8, 2020 5:50 pm
Follow us on


అమరావతి రాజధాని భూ సమీకరణలో గత ప్రభుత్వం టీడీపీ నేతలకు అనుచిత లబ్ది చేకూరేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అందులో భాగంగా సిట్ ను ఏర్పాటు చేసి కొంతమంది అధికారుల అరెస్టులకు దిగింది. అంతే కాకుండా ఈ అంశంపై మరింత దూకుడుగా వెళ్లి టీడీపీకి అనుకూలంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, రాజకీయ ప్రత్యర్థి పార్టీపైనా పై చేయి సాధించాలనే ఉద్దేశంతో దూకుడుగా ముందుకెళ్తోంది.

ప్రపంచంలోనే తొలిసారి భూ సమీకరణ అనే నూతన విధానాన్ని రాజధాని కోసం ప్రవేశ పెట్టామంటూ గత టీడీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాజధాని భూ సమీకరణలో పనిచేసిన కొందరు డిప్యూటీ కలెక్టర్ లు గత ప్రభుత్వ పెద్దల వత్తిడితో కొన్ని గ్రామాల పరిధిలోని లంకలు, అస్సైన్డ్‌ భూములతోపాటు మెట్ట భూములను జరీబుగా నమోదు చేసి, పలువురు టీడీపీ నేతలకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న వాదనలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజధాని భూ సమీకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది. విచారణలో అక్రమాలు రుజువు అవ్వడంతో ఒక డిప్యూటీ కలెక్టర్ ను అరెస్టు చేసింది.

రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలో ఉన్న ఏపీసీఆర్డీయే లోకల్‌ కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయంలో గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా వ్యవహరించిన మాధురిని సిట్‌ బృందం రెండు రోజుల కిందట విచారించింది. ఆమె ఆ గ్రామంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న లింగాయపాలెం, ఉద్ధండరాయుని పాలెం, మోదుగులంక పాలెం తదితర గ్రామాలకు చెందిన ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారాలనూ పర్యవేక్షించారు. ఈ సమయంలో టీడీపీ నాయకులకు లబ్ధిచేకూరే విధంగా వ్యవహరించారని సిట్ వాదన. మరోవైపు నెక్కల్లులో లేని భూమి సుమారు 3.20 ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్నట్లుగా అక్కడ పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ మాధురి రికార్డుల్లో చూపి, కొందరు టీడీపీ నేతలకు రూ.కోట్లలో లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై కొద్ది రోజుల క్రితమే ఆమెను ‘సిట్‌’ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో రాజధాని భూసమీకరణలో సేవలందించిన అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. రాజధాని భూముల వ్యవహారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అడ్డదారుల్లో నడిచిన అధికారులలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.