MLA Rajaiah Vs Navya: సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్.. చిక్కుల్లో ఎమ్మెల్యే రాజయ్య

ఎవరు తన వెంట ఉన్నా లేకున్నా పోరాటం సాగిస్తానని నవ్య స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అత్త, ఆడ పడుచు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. " నా కోడలు ఎటువంటి తప్పు చేయలేదు.

Written By: Bhaskar, Updated On : June 29, 2023 7:35 am

MLA Rajaiah Vs Navya

Follow us on

MLA Rajaiah Vs Navya: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ నవ్యకు మద్దతుగా అత్త, ఆడపడుచు నిలవడంతో ఈ పరిణామం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. ఇన్ని రోజులు ఒంటరి పోరాటం చేసిన నవ్యకు ఒకింత ఆసరా లభించింది. నవ్య భర్త కూడా ఎమ్మెల్యే రాజయ్య వర్గంలో చేరడంతో నవ్య ఒంటరిదయిపోయింది. పైగా అప్పట్లో తనకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో నవ్య ఆందోళనలో కూరుకుపోయింది. “నాడు ఎమ్మెల్యే రాజయ్య తన ఇంటికి వచ్చి కీలకమైన బిల్లులు, ఇతర బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వాటి గురించి నేను ప్రస్తావిస్తే ఇప్పుడు బాండ్ పేపర్ మీద సంతకం చేయాలి అంటున్నారు.. దీనికి నా భర్త కూడా వత్తాసు పలుకుతున్నారు. ఒంటరిదాన్ని అయిపోయాను. అవసరమైతే నా భర్తకు కూడా విడాకులు ఇస్తాను” అని ఇటీవల నిర్వహించిన విలేకరుల నవ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విలేకరుల సమావేశం నిర్వహించిన నాటి నుంచి భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఒకానొక దశలో నవ్యతో ఆమె భర్త కూడా విభేదించడంతో ఒక్కసారిగా ఈ కథలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఫలితంగా అన్ని వేళ్ళూ నవ్య వైపు చూపించాయి.

అండగా అత్త, ఆడపడుచు

ఎవరు తన వెంట ఉన్నా లేకున్నా పోరాటం సాగిస్తానని నవ్య స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అత్త, ఆడ పడుచు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ” నా కోడలు ఎటువంటి తప్పు చేయలేదు. ఎమ్మెల్యే రాజయ్య, అనుచరులు వేధిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నా కోడలు తన ఒంటిపై ఉన్న బంగారం కూడా అమ్ముకుంది. వారసత్వంగా వచ్చిన పొలాన్ని కూడా విక్రయించింది. అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేను అడిగితే ఆయన లైంగికంగా వేధించాడు. గ్రామానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు” అని నవ్య అత్త ఆరోపించింది. మరోవైపు ఎమ్మెల్యే రాజయ్య పై చేస్తున్న యుద్ధంలో తొలుత నవ్యకు ఆమె భర్త సహకరించాడు. తర్వాత మాట మార్చాడు. ఎమ్మెల్యే రాజయ్య వైపు మాట్లాడాడు.

యూ టర్న్ తీసుకున్న నవ్య భర్త

రాజయ్య ఎలాంటి వేదింపులకు పాల్పడలేదని రాసిన ఒప్పందంపై సంతకం పెట్టాలని నవ్య పై ఆమె భర్త ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో నవ్య ఆమె భర్త తో విభేదించింది. అవసరమైతే విడాకులు కూడా ఇస్తానని సంచలన ప్రకటన చేసింది. నవ్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో సద్దుమణిగింది అనుకున్న ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ మరో కీలక మలుపుతీసుకుంది. ఇక రాష్ట్రంలో ఇంతటి దారుణం జరుగుతున్నప్పటికీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం పట్ల నవ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విధి లేని పరిస్థితుల్లోనే తాను రోడ్డుపైకి వచ్చానని నవ్య చెబుతోంది. ఆత్మగౌరవాన్ని చంపుకొని బయటకు వచ్చాను అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని నవ్య అంటోంది.. మహిళల భద్రత గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే కేటీఆర్.. తన గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని నవ్య ప్రశ్నిస్తోంది. తన ఆరోపణలో నిజం లేకుంటే శిక్షించాలని ఆమె చెబుతోంది. ఎమ్మెల్యే మనుషులు తన కుటుంబంలో చిచ్చు పెట్టారని నవ్య ఆరోపిస్తోంది.