Jyoti Malhotra: ఉగ్రవాదులకు సహకరించారు.. ఉగ్రవాద అనుబంధ సంస్థలతో కార్యకలాపాలు నెరిపారు.. మనదేశంలో సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేర్చారు అనే అభియోగాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ పై దృష్టి సారించాయి. దీంతో వారిద్దరి అసలు పన్నాగం బయటపడింది. వీరిద్దరూ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల విచారణలో ఉన్నారు. అధికారుల విచారణలో వీరికి సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా వీరి బ్యాంకు ఖాతాలలో భారీగా నగదు ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడేవారు బినామీ ఖాతాలతో ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తారు. కానీ జ్యోతి మల్హోత్రా, సిరాజ్ తమ పేరుతోనే బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుండడం విశేషం. పైగా బ్యాంకు ఖాతాలలో భారీగా నగదు ఉండడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read: అమెరికా క్షిపణి పరీక్ష.. దేనికోసమంటే..
జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ లో పనిచేసే వ్యక్తితో కొనసాగించిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది. తనని పెళ్లి చేసుకోవాలని జ్యోతి అతని కోరినట్టు ఆ చాట్ లో ఉంది. అంతేకాదు తనకు ఇస్లామాబాద్ అంటే చాలా ఇష్టమని.. ఇస్లామాబాద్ నగరాన్ని విడిచిపెట్టి రావడం తనకు ఇష్టం లేదని ఆ చాట్ లో జ్యోతి కోరడం విశేషం. మరోవైపు ఐసీస్ అనే ఉగ్రవాద సంస్థ కోసం పని చేస్తున్న సిరాజ్ వ్యవహారం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు తెలియడంతో విజయనగరంలో కలకలం నెలకొంది. ఇక సిరాజ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు ఉండడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానికంగా ఉన్న డిసిసిబి లో అతడికి ఖాతా ఉంది. అందులో దాదాపు 50 లక్షల వరకు నగదు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నగదును విత్ డ్రా చేయడానికి సిరాజ్ తల్లిదండ్రులు ప్రయత్నించగా.. బ్యాంకు అధికారులు కుదరదని చెప్పారు.
సిరాజ్, జ్యోతి కి దుబాయ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఖాతాలలో నగదువేశారు అని తెలుస్తోంది. అయితే దుబాయిలో వీరికి నగదు వేసిన వ్యక్తులు ఎవరు? విడతలవారీగా లక్షలకు లక్షలు నగదు ఎందుకు వేశారు? ఆ నగదుతో వీరు మనదేశంలో ఎలాంటి కుట్రలకు శ్రీకారం చుట్టారు? అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే జ్యోతి గురించి.. సిరాజ్ గురించి అధికారులు కీలక విషయాలు రాబట్టారు. లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా కీలక సమాచారం బయటకు వస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దర్యాప్తు సంస్థల అధికారులు వీరికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.