బరాక్ ఒబామా.. అమెరికా 44వ అధ్యక్షుడు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరిక్ ను సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా ఖండం బయట జన్మించి.. అగ్ర దేశానికి అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. 2004లో అమెరికా సెనేట్ ఎన్నికల్లో గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున గెలిచిన ఆయన.. 2007లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టారు. తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్‌కైన్ ను ఓడించి 2009 జనవరి 20న అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
Also Read: జగన్ ఇస్తానన్నా.. వాళ్లు ఇంట్రస్ట్ చూపించడం లేదట.!
ఒబామా తన పాలనలో ఎంతగానో ప్రజాదరణ పొందారు. అమెరికాకు ఆయన అందించిన సేవలు ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు మరోమారు అగ్రరాజ్యం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి కమలా హారీస్ పోటీ పడుతున్నారు. అటు రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగుతున్నారు. వారికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రచార కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 21న ఫిలడేల్ఫియా, పెన్సిల్వేనియాలో జరిగే ప్రచారంలో ఒబామా పాల్గొంటున్నారు. ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఒబామా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నాయి. ఆయనకు మంచి వక్తగా పేరు కూడా ఉంది. అందుకే ట్రంప్‌ను ఎదుర్కోవాలంటే దీటైనా ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ భావించింది. మరోవైపు ఒబామా ప్రచారంపై ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. ప్రజలపై ఆయన అంతగా ప్రభావం చూపలేరని అభిప్రాయపడుతున్నారు. అందుకే.. 2016లో తనకు పట్టం కట్టారన్నారు.
మరోవైపు అధ్యక్ష ఎన్నికలో భాగంగా అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ప్రజల్లో విభజన తెచ్చేందుకు ట్రంప్ ఎంత దూరమైనా వెళ్తారని బైడెన్ ఆరోపిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన సంతోషిస్తారంటూ మండిపడుతున్నారు. అటు ట్రంప్ సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బైడెన్ అవినీతిపరుడని ఆరోపించారు. విఫల రాజకీయవేత్త అని దుయ్యబట్టారు. అంతేకాదు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.
Also Read: మరో దుమారం: ఏపీ సర్కార్ కు అప్పుగా టీటీడీ నిధులా?
మరోవైపు ఇప్పటివరకు నిర్వహించిన పలు సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ బైడెనే దూసుకెళ్తున్నట్లు సమాచారం. నీల్సన్ కంపెనీ వివరాల ప్రకారం.. ఇటీవల ఏబీసీలో ప్రసారమైన 90 నిమిషాల బైడెన్ చర్చా కార్యక్రమాన్ని 14.1 మిలియన్ల మంది వీక్షించారట. మరోవైపు ఎన్‌బీసీ, సీఎన్బీసీ, ఎంఎస్‌ఎన్బీసీ ఛానళ్లలో ప్రసారమైన ట్రంప్ 60 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని 13.5 మిలియన్ల మంది వీక్షించారు. ఓ వైపు చూస్తే ఇరువురి మధ్య కూడా పోటాపోటీ కనిపిస్తున్నట్లే ఉంది. చివరికి అమెరికా ప్రజలు ఎవరికి పట్టం కడుతారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చూడాలి మరి.