ఏపీ సీఐడీ పోలీసుల చేతిలో అరెస్ట్ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు గట్టి షాక్ తగిలింది. గుంటూరులోని సీఐడీ న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 28 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఇక ఎంపీ కాళ్లపై గాయాలు ఉండడంతో ఎంపీని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ముందుగా జీజీహెచ్. . ఆ తర్వాత రమేశ్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఆయన కోలుకునే వరకు ఆస్పత్రిలో ఉండొచ్చని తెలిపింది. ఆస్పత్రిలో కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతుందని తెలిపింది.
ఇక వైసీపీ ఎంపీ రఘురామ గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. రెండు ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్ కు కోర్టు ఆదేశించింది.
కాగా ఎంపీ రఘురామ తనను కొట్టారని కోర్టును తప్పుదారి పట్టించారని అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చిందని.. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం కూడా తెచ్చారని ఆయన వివరించారు. అప్పటివరకు రఘురామ మామూలుగానే ఉన్నారని.. పిటీషన్ డిస్మస్ కాగానే కొత్త నాటకానికి తెరతీశారని ఏఏజీ ఆరోపించారు. మెడికల్ కమిటీ నివేదిక రేపు మధ్యాహ్నంలోగా వస్తుందని అప్పుడు తెలుస్తుందని అన్నారు.