
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరామ్ బరిలో నిలుస్తుండడంతో ఇప్పుడు అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ స్థానంలో కాంగ్రెస్ కూడా కోదండరాంకు మద్దతు తెలుపుతుందని అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
ఇటీవల కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమితులైన ఠాగూర్ శనివారం హైదరాబాద్ వచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సొంతంగా బరిలో దిగాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌తో చర్చించినట్లుగా తెలిసింది. ఠాగూర్ ఎన్నికలు జరిగే జిల్లాల నేతలనూ అక్కడి పరిస్థితుల మీద తెలుసుకున్నారు.
ఇప్పటికే ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను టీజేఎస్ కోరింది. కానీ.. ఇతరులకు మద్దతు ఇస్తే పార్టీకి నష్టమనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిబుచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని మెజార్టీ నేతలు కోరారు. బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని సూచించారు. పార్టీ నేతలు చేసిన సూచనలపై ఠాగూర్ కూడా సానుకూలంగా స్పందించారు.
ఈ మేరకు ఆయన అధిష్టానంతో చెప్పి నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కార్యకర్తల అభీష్టం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలిస్తే ఇక కోదండరాం సొంతంగా తన బలాన్ని చాటుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో మరింత వేడి వాతావరణంలో జరుగనున్నాయి.