
భారత సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత సైనికులను చంపిన చైనాపై భారతీయులు ప్రతీకారం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రధాని మోడీ చైనా యాప్స్ లను నిషేధించి గట్టి హెచ్చరిక జారీ చేయగా.. ప్రస్తుతం భారతీయులంతా చైనా వస్తువుల వాడకాన్ని తగ్గించేశారట.. ఇక చైనా వస్తువుల దిగుమతిని భారతీయ వ్యాపారులు చేసుకోవడం లేదట.. దీంతో చైనాకు భారీ షాక్ ను భారతీయులు ఇస్తున్నట్టైంది.
చైనాతో గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత చైనా తీరుపట్ల భారతీయుల్లో మార్పు వచ్చింది. చాలా మంది చైనా తయారీ వస్తువులను కొనడం లేదు. ప్రత్యామ్మాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.
గతంలో దేశంలో చైనా వస్తువులు బాగా కొనేవారు. కానీ ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ‘లోకల్ సర్కిల్’ కమ్యూనిటీ సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో 43 శాతం మంది భారతీయులు చైనాలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయరాదని వెల్లడించారు. గతంలో కొన్నవారు ఇప్పుడు బాగా తగ్గించారు.
గల్వాన్ ఘటన తర్వాత భారత్ లో ‘బాయ్ కాట్ చైనా’ నినాదం ఊపందుకుంది. ఆ ప్రభావంతోనే విక్రయాలు తగ్గినట్లుగా భావిస్తున్నారు. గత నవంబర్ లో పండగ సీజన్ లో 71శాతం భారతీయులు చైనా వస్తువులను కొనుగోలు చేయలేదని ‘లోకల్ సర్కిల్స్’ సర్వే పేర్కొంది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థకు భారత్ భారీ దెబ్బ తీసినట్టే కనిపిస్తోంది.