Magunta Sreenivasulu Reddy: ఎన్నికల ముంగిట వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎంపీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. వరుసగా ఎంపీలు దూరమవుతుండడంతో వైసీపీలో ఒకరకమైన కలవరం రేగుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలను కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా మాగుంట అసంతృప్తిగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన స్థానంలో జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఇటీవల ఒంగోలు ఇళ్ల పట్టాల పంపిణీకి సైతం మాగుంటను పిలవలేదు. దీంతో పార్టీలో ఉండడం మంచిది కాదని మాగుంట ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీకి రాజీనామా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో కుదుపు.
గత ఎన్నికలకు ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జగన్ కు అత్యంత వీర విధేయుడుగా ఉంటూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో కలత చెందారు. ఆయన కుమారుడు రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. జైలుకు కూడా వెళ్లారు. అప్పటినుంచి జగన్ తో గ్యాప్ పెరిగింది. ఈయన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నా.. వై వి సుబ్బారెడ్డి పుణ్యమా అని ఒక్కటయ్యారు. వైవితో ఉన్న విభేదాలతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంటను చేరదీశారు. మాగుంట ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేస్తామని చాలా సందర్భాల్లో బాలినేని చెప్పుకొచ్చారు. బాలినేని సైతం మా గుంట కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ నో చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం టికెట్ ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించారు. దీంతో మాగుంట దీనిని అవమానంగా భావించారు. అందుకే పార్టీకి రాజీనామా చేశారు.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవకు ఒంగోలు పార్లమెంట్ స్థానం టికెట్ కావాలని మాగుంట కోరారు. కానీ జగన్ వినలేదు. చివరకు మాగుంట అభ్యర్థిత్వాన్ని సైతం పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇప్పటికే మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ఆయన కుమారుడితో కలిసి టిడిపిలో చేరతారని సమాచారం. కాగా పార్టీకి రాజీనామా చేసిన మాగుంట మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. మా గుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందని చెప్పుకొచ్చారు. 8 సార్లు పార్లమెంట్, రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనట్లు తెలిపారు. మాగుంట కుటుంబానికి అహంలేదని.. ఆత్మగౌరవం ఉందని.. గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికైతే ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.