Gaddam Vivek: బీజేపీకి బిగ్ షాక్.. సొంత గూటికి బడా మాజీ ఎంపీ.. కాంగ్రెస్ లో చేరిక

వ్యాపారవేత్త అయిన వివేక్‌.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

Written By: Raj Shekar, Updated On : November 1, 2023 1:29 pm

Gaddam Vivek

Follow us on

Gaddam Vivek: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీలోని బిగ్‌షాట్‌.. వ్యాపారవేత్త, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గడ్డం వెంకటస్వామి(కాకా) తనయుడు గడ్డం వివేక్‌ మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. దాదాపు నెల రోజుల ఊగిసలాట తర్వాత బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. ఆ వేంటనే రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన కుమారుడు వంశీకి చెన్నూర్‌ అసెంబ్లీ టికెట్‌ ఇస్తామన్న హామీపై వివేక్‌ హస్తం గూటికి చేరారని తెలిసింది.

పదేళ్లలో మూడు పార్టీలు…
వ్యాపారవేత్త అయిన వివేక్‌.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మళ్లీ పోటీచేశారు. కానీ బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో వివేక్‌ కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో పునరాలోచనలో పడిన వివేక్‌ ఆ పార్టీని వీడారు. బీజేపీలో చేరి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున వెంకటేశ్‌నేత పోటీచేసి గెలిచారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వివేక్‌ బీజేపీలో చేరారు. సుమారు ఐదేళ్లు బీజేపీలో కొనసాగారు. వివిధ పదవుల్లో పనిచేశారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. అయితే తాజాగా బీజేపీ పరిస్థితి బాగా లేకపోవడం, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతుండడంతో నెల రోజులుగా పార్టీ మార్పుపై సమాలోచనలు చేశారు. చివరకు తన కొడుకు వంశికి చెన్నూర్‌ టికెట్‌ ఇస్తామన్న హామీతో బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మొత్తంగా పదేళ్ల తెలంగాణ రాజకీయాల్లో వివేక్‌ మూడు పార్టీలు మారారు.

కాంగ్రెస్‌కు ఆర్థిక, మీడియా బలం..
తెలంగాణలో జోరు మీద ఉన్న కాంగ్రెస్‌కు వివేక్‌ చేరిక నిజంగా బలమనే చెప్పుకోవాలి. వ్యాపారవేత్త అయిన వివేక్‌ మంచి ఆర్థిక బలం ఉంది. దీంతో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లోని దాదాపు 20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపనున్నారు. అభ్యర్థుల ఖర్చును కూడా భరించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివేక్‌ చేరికతో కాంగ్రెస్‌కు మీడియా బలం లభించనుంది. వివేక్‌ సొంతంగా నడుపుతున్న వీ6 న్యూస్‌ చానెల్‌తోపాటు వెలుగు పత్రిక ద్వారా మంచి ప్రచారం లభిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందుకే వివేక్‌ను పార్టీలోకి తీసుకురావడానికి టీపీసీసీ చీఫ్‌ రేవంతే స్వయంగా రంగంలోకి దిగారు. మొత్తంగా వివేక్‌ చేరిక కాంగ్రెస్‌కు ప్లస్‌ అవుతుందని టీపీసీసీ చీఫ్‌ స్వయంగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.