తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వైఎస్ షర్మిల.. కేసీఆర్ లూప్ హోల్ ను పట్టుకున్నారు. కేసీఆర్ ఆయువు పట్టుపై కొడుతున్నారు.. నీళ్లు, నిధులు సాధించిన కేసీఆర్ ప్రధానంగా తెలంగాణ కోసం కొట్లాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. దాన్నే ఆయుధంగా చేసుకొని షర్మిల రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. నిరుద్యోగులను ఆకర్షిస్తూ కేసీఆర్ సర్కార్ ను ఇరుకునపెడుతున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలంపైనే కొట్టాలన్నట్టు కేసీఆర్ ను దెబ్బతీస్తున్నారు. అందుకే కేసీఆర్ సైతం తాజాగా 50వేల ఉద్యోగాల ప్రకటన చేశారు.
ఈ క్రమంలోనే తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ప్రతి మంగళవారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్లు జారీ చేసే వరకు కూడా ఉద్యమాన్ని ఆపకూడదని డిసైడ్ అయ్యారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుం బిగించింది. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వాలని షర్మిల 72 గంటల పాటు దీక్ష చేపట్టింది. అయినా ప్రభుత్వ స్పందన నాడు రాలేదు. షర్మిలను అరెస్ట్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే వరాలు కురిపించే సంస్కృతిని మానుకొని బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ రూపొందించాలనే డిమాండ్ తో షర్మిల ఈ దీక్ష చేపట్టారు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసే వరకు షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేపట్టి ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు.