YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎడ మొఖం, పెడముఖంగా ఉండే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా..? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో జోరుగా సాగుతోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్న అంశం మీద ఈ రెండు పార్టీలతో ఆమె సంప్రదింపులు సాగిస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్, రేవంత్ రెడ్డితో ఫోన్లో ఆమె మాట్లాడారు. ఇది కార్యరూపం దాలిస్తే తెలంగాణలో ప్రతిపక్షాల ఐక్య కూటమి కెసిఆర్ సర్కారుపై పోరుబాట సాగించే అవకాశం ఉంది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదాం అని ఈ సందర్భంగా ఆమె వారిద్దరినీ కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని ఆమె సూచించారు. ‘కెసిఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరు’ అని షర్మిల ఈ సందర్భంగా అన్నారు.
నిరుద్యోగుల విషయంలో పోరాటానికి సిద్ధం..
ఉమ్మడి పోరాటం చేసేందుకు షర్మిలకు బండి సంజయ్ మద్దతు తెలిపి.. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. షర్మిల ఫోన్ పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
వేధింపులతో ఏకమయ్యే పరిస్థితి..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై కెసిఆర్ సర్కార్ అణచివేతలకు పాల్పడుతోంది. అనేకసార్లు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, షర్మిలపై తీవ్రంగా తెలంగాణ సర్కారు వ్యవహరించింది. పలుమార్లు ప్రతిపక్ష నాయకులు అరెస్టులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏకతాటిపైకి రావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని షర్మిల భావించింది. అందుకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షాల ప్రజా సమస్యలపై ఏకతాటిపైకి వచ్చి పోరాడటం వల్ల ఫలితం ఉంటుందని భావించిన షర్మిల ఈ దిశగా ప్రయత్నం చేయడం మంచి పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే పరిస్థితి..
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగి సుమారు ఐదేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రజా మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఆయా పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేయగా, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగిస్తున్నారు. షర్మిల పాదయాత్రలో ఇప్పటికే కొనసాగుతున్నారు. దీన పద్యంలో ప్రతిపక్షాలు ఏకతాటిపై రావడం వలన ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపక్షాలు ఐక్యం కావాలన్న షర్మిల ప్రతిపాదన సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వేడి మీద ఉన్నాయి. ఒకపక్క ఈడీ కేసులతో కెసిఆర్ కుమార్తె కేసు కవిత చిక్కుల్లో చిక్కుకొని ఉంది. కెసిఆర్, కేటీఆర్.. కవితను ఈ ఉచ్చు లోంచి బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఏకమయ్యా దిశగా పావులు కదుపుతుండడం కెసిఆర్ సర్కార్కు కొంత ఇబ్బందికరమైన అంశంగానే భావించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
Web Title: Sharmilas phone to revanth and bandi sanjay
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com