
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫ్యామిలీలో చీలకలు వచ్చాయా..? అధికారంలోకి రాకముందు చెల్లి షర్మిలను అక్కున చేర్చుకున్న జగన్ ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నాడు..? అందుకే.. షర్మిల పార్టీ పెట్టబోతున్నారా..? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ టాపిక్ పైనే ప్రధాన చర్చ నడుస్తోంది. ఈ ప్రచారాలను టీడీపీ మరింత అడ్వాంటేజీకి తీసుకుంది. వాస్తవాలను మరిచి ప్రచారాన్ని పీక్స్‌కు చేర్చాలని చూస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పబోతోన్నారంటూ కొద్దిరోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెర పడట్లేదు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతోన్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదంటూ వైఎస్ షర్మిల తేల్చి చెప్పిన తరువాత కూడా.. దానికి సంబంధించిన చర్చకు బ్రేక పడట్లేదు. కారణాలు ఏమైనప్పటికీ- ఈ అంశాన్ని కొన్నాళ్లపాటు సజీవంగా ఉంచదలచుకుంటున్నట్లు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఎస్సార్సీపీపై ఎదురుదాడి చేయడానికి వినియోగించుకోనున్నట్లు స్పష్టమౌతోంది. వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమేనంటూ తెలుగుదేశం సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు సబ్బం హరి వెల్లడించారు. దీనిపై తనకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు.
ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీని రిజిష్టర్ కూడా చేయించారని, లాంఛనప్రాయంగా ప్రారంభించడానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఏకపక్ష వైఖరి ఆయన కుటుంబంలో విభేదాలకు దారి తీస్తోందని ఈ డిబేట్ సందర్భంగా సబ్బం హరి ప్రస్తావించారు. వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం వెనుక ఆమె తల్లి విజయమ్మ పాత్ర ఉందని తాను భావిస్తున్నట్లు సబ్బం హరి చెప్పారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తన కుమార్తెకు భాగస్వామ్యాన్ని కల్పించకపోవడం పట్ల విజయమ్మ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తామని మొదట్లో వైఎస్ జగన్ చెల్లెలికి హామీ ఇచ్చి.. అనంతరం దాన్ని విస్మరించారనే అసంతృప్తి విజయమ్మ-షర్మిలలో వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే జగన్–-షర్మిల మధ్య అగాథం ఏర్పడిందని అన్నారు.
మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై జగన్ సర్కార్ చేస్తున్న దాడి రాజ్యాంగ విరుద్ధమని సబ్బం హరి విమర్శించారు. దీన్ని రాజ్యాంగంపై చేపట్టిన దాడిగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేధావులు సమర్థించబోరని అన్నారు. రమేష్ కుమార్‌తో నెలకొన్న వివాదంలో జగన్ సర్కార్‌కు అన్నీ ప్రతికూల ఫలితాలే ఎదురు కావడం ప్రజాస్వామ్యం విజయం సాధించిందనడానికి నిలువెత్తు సాక్ష్యమని వ్యాఖ్యానించారు.