Indian Presidential Election: దేశానికి తదుపరి రాష్ట్రపతి ఎవరు? ఇప్పుడు దేశంలో అందరి మనసులో తొలుస్తున్న ప్రశ్న ఇది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇంతవరకూ క్లారిటీ ఇవ్వడం లేదు. తమకు మైలేజీ వచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ గురించి ఆర్భాటంగా చెప్పుకునే కేంద్ర పెద్దలు.. రాష్ట్రపతి ఎన్నిక విషయానికి వచ్చేసరికి మాత్రం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)ను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన ఓట్ల శాతానికి కూతవేటు దూరంలో ఉండడంతో ఇప్పుడు ఎన్టీఏ పాత్ర కీలకమైంది. కూటమిలోకి వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ వంటి పార్టీలను చేర్చి రాష్ట్రపతి గండం నుంచి గట్టెక్కాలని భావిస్తోంది. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నదే ఇప్పుడు ప్రశ్న. ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడా? లేక తెలంగాణ గవర్నర్ తమిళసై అనేది స్పష్టత లేదు. మరోవైపు విపక్షాలు ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తో పాటు అన్నాహజారేలను ప్రయోగించాలని భావిస్తున్నాయి. ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు బీజేపీకి కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అందుకే తమతో కలిసి ఉన్న పార్టీలతో పాటు సహకారం అందించనున్న పార్టీల మనోగతం తెలుసుకునే పనిలో బీజేపీ పెద్దలు ఉన్నారు.

అరుదైన అవకాశం వచ్చినా..
అయితే రాష్ట్రపతి అయ్యే అరుదైన అవకాశం మన తెలుగువాడు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముందరకు వచ్చింది. కానీ దానిని అందిపుచ్చుకోలేని స్థితిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. ఇందుకు రాజకీయ కారణాలే ప్రధానం. వెంకయ్యనాయుడు ఇటీవలే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆయనైతే రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. కానీ కీలకమైన వైసీపీ మాత్రం నో చెప్పినట్టు సమాచారం. గత మూడు సంవత్సరాల నుంచి లోక్‌సభలోకానీ, రాజ్యసభలోకానీ బీజేపీకి బలం తగ్గినప్పుడల్లా ఆదుకుంటున్న వైసీపీ వెంకయ్యనాయుడైతే మద్దతిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: MIM- Shiv Sena: ఏమన్నా కాంబినేషనా? శివసేన+ఎంఐఎం కలిసిపోయాయ్
కష్టకాలంలో ఆదుకుంటున్న వైసీపీ మాటను గౌరవించాలా? లేక వైసీపీని ఒప్పంచి వెంకయ్యనాయుడికి మార్గం సుగమం చేస్తామా? అన్న డిఫెన్ష్ లో బీజేపీ పెద్దలు పడిపోయారు. వెంకయ్యనాయుడి శరీరం బీజేపీలో, మనసు తెలుగుదేశంలో ఉంటుందని గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. అయితే ఇటీవల వెంకయ్యనాయుడు విషయంలో వైసీపీలో కొంత మార్పు వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం వెంకయ్యపై గౌరవభావంతో మెలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆమె అయితే మాత్రం…
వెంకయ్యనాయుడు వరకూ తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత సానుకూలంగా ఉన్నారు. కానీ బీజేపీని టార్గెట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటుండడంతో వెంకయ్యకు మద్దతు ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు కేంద్రం ఏకగ్రీవంగా ఎన్నికకు ముందుకొస్తే కేసీఆర్ మెత్తబడే అవకాశముంది. ఒక వేళ తెలంగాణ గవర్నర్ తమిళసై సందరరాజన్ ను మాత్రం బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తే మాత్రం కేసీఆర్ బాహటంగా వ్యతిరేకించే అవకాశముంది.కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసైకి, అధికార టీఆర్ఎస్‌కు హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. కొన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని టీఆర్ ఎస్ ఆరోపణ. తాజాగా ఆమె మహిళా దర్బార్ నిర్వహించి రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తనను కలిసిన మహిళలంతా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారల గురించే చెబుతున్నారరి తమిళసై చెప్పారు. తెలంగాణ మహిళల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎదురు చెప్పేవాళ్లను తాను పట్టించుకోనని, తననెవరూ అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు
కొత్తగా వారి పేర్లు..
బీజేపీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న కేసీఆర్ నాలుగురోజుల క్రితం సంచలనం నమోదవుతుందని ప్రకటించారు. అది రాష్ట్రపతి విషయంలో చేసిన హెచ్చరికగానే అందరూ భావిస్తున్నారు. శరద్‌పవార్ అయితే ప్రతిపక్షాలతోపాటు బీజేపీ పక్షాలు కూడా మద్దతిస్తాయనేది కేసీఆర్ యోచనగా ఉంది. అయితే శరద్‌పవార్ ఏ విషయం తేల్చలేదు. అన్నాహజారేను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనేది కేసీఆర్ రెండో ప్రణాళికగా ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి ఇంకా ఎన్ని రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో వేచిచూడాల్సి ఉంది.