KCR: తెలంగాణ ఎన్నికల ఫలితాలు సెంటిమెంట్లను బ్రేక్ చేశాయి. ఆనవాయితీలకు సైతం చెక్ చెప్పాయి. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం విషయంలో ఇన్నాళ్లు సాగిన సెంటిమెంట్.. ఈసారి మాత్రం తిరగబడింది. ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ అస్త్రంగా చేసుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ వారు ఊహించిన దానికి విరుద్ధంగా జరగడం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందితే.. అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ ఈసారి గజ్వేలులో కేసీఆర్ గెలుపొందినా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మ్యాజిక్ ఫిగర్ బీఆర్ ఎస్ కు దక్కకపోవడం గమనార్హం. 2014 నుంచి కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు.
ఇప్పటివరకు గజ్వేల్ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 15 సార్లు ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే.. అదే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. అందుకే ఈ సెంటిమెంట్ తోనే కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో సాగిన సెంటిమెంట్.. ఈసారి మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే ఇదే సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బిజెపిలో ఈ నియోజకవర్గంలో గట్టి ప్రయత్నమే చేశాయి. కానీ కెసిఆర్ విజయాన్ని దక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం ఆయనకు చిక్కకపోవడం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని పొంది హ్యాట్రిక్ కొట్టాలన్న వారి ఆలోచనకు గండి పడింది.