బెంగాల్ లో బీజేపీని చిత్తు చేసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు దేశ రాజీయాలను శాసించడానికి బయలు దేరారు. ఈ క్రమంలోనే సంచలన అడుగులు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడానికి నేరుగా రంగంలోకి దిగుతున్నారు.
తృణమూల్ పార్టీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు తాజాగా అధినేత్రి మమతా బెనర్జీని పార్లమెంటరీ పార్టీ కమిటీ చైర్ పర్సన్ గా ఎన్నుకోవడంతో ఆ దిశగా తొలి అడుగు పడింది. ఈ పరిణామంతో ఇంతవరకూ సొంత రాష్ట్ర అవసరాలకే అత్యధిక సమయం కేటాయించిన మమతా బెనర్జీ ఇప్పుడు దేశ రాజకీయాలపైనా కేంద్రీకరించనున్నారని తెలుస్తోంది.
శనివారం ఢిల్లీ పర్యటనకు మమతా బెనర్జీ రానున్నారు. దానికి ఒకరోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ పర్యటనలో వివిధ పార్టీల నేతలతో భేటి కానున్నారు.ప్రధాని మోడీని కూడా కలవనున్నారు.
నిజానికి దేశంలో అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలు మమతా బెనర్జీ. ఆమె ఇప్పటికే ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. వరుసగా మూడు సార్లు బెంగాల్ సీఎంగా కొనసాగుతున్నారు. ఆమెకున్న సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఇప్పుడు దేశ రాజకీయాల్లో వాడితే ఖచ్చితంగా మోడీకి ప్రత్యామ్మాయ శక్తిగా వినియోగించుకోవచ్చని ఎదగవచ్చని రాజకీయ నేతలు భావిస్తున్నారు.