ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ బర్త్ డే. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ సాధారణ కార్యర్త నుంచి కేబినెట్ మంత్రుల దాకా అందరూ సిద్ధమైపోయారు. అయితే.. సహజంగా ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు పాలాభిషేకం చేయడం నుంచి ఫ్లెక్సీలు కట్టడం దాకా.. రకరకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆయా పార్టీల నేతలు. కానీ.. ఇందుకు భిన్నంగా సూచనలు చేశారు కేటీఆర్. ఇలాంటి పనులకు బదులుగా సేవా కార్యక్రమాలకు డబ్బులు వెచ్చించాలని పార్టీ నేతలకు సూచించారు.
గత పుట్టిన రోజు సందర్భంగా.. అంబులెన్సులు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు కేటీఆర్. తన వంతుగా 6 అంబులెన్సులకు విరాళం ఇస్తున్నానని, మీరు కూడా తోచినంత ఇవ్వాలని సూచించారు. దీంతో.. చాలా మంది బడా నేతలు అంబులెన్సులకు విరాళాలు ప్రకటించారు. అయితే.. ఈ పుట్టిన రోజున మరో అంశంతో ముందుకు వచ్చారు. వికలాంగులకు ట్రై స్కూటర్లను పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కేటీఆర్ తన వంతుగా వంద స్కూటర్లను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు తెలిపి.. మీరు కూడా ఇదేవిధంగా చేయాలని సూచించారు.
కేటీఆర్ చేసిన ఈ సూచనకు గులాబీ నేతలు.. మంత్రులు వెంటనే స్పందించారు. తాము కూడా ట్రై స్కూటర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫ్లెక్సీలు, పూలదండలకన్నా.. ఇలాంటి నిర్ణయాల ద్వారా వికలాంగులకు, ఇతరులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆచరణీయమైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలాఉంటే.. ఎంపీ జోగినపల్లి సంతోష్ ఆధ్వర్యంలో మరోసారి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ముక్కోటి వృక్షార్చన’ పేరుతో దీన్ని చేపడుతున్నారు. ఈ వృక్షోత్సవానికి సెలబ్రిటీలు మద్దతు ప్రకటిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సీనియర్ నటి రమ్యకృష్ణ తన సపోర్టు తెలియజేశారు. కేటీఆర్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన రమ్యకృష్ణ.. హరిత తెలంగాణగా మార్చేందుకు ఎంపీ సంతోష్ కుమార్ తో చేతులు కలపాలని అందరినీ కోరారు. ఈ విధంగా.. కేటీఆర్ బర్త్ డే వేళ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు గులాబీ శ్రేణులు.