
MLA Rapaka Varaprasad: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కోసం టిడిపి డబ్బులు ఎర చూపిందా. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్పింది నిజమా..? సజ్జల చేసిన విమర్శలను నిలబెట్టుకునేందుకే రాపాకును వైసీపీ బరిలోకి దించిందా..? అన్న విమర్శలు ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను సమర్థించేలా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. రాపాకతో వైసీపీ నేతలు కావాలనే ఈ విధంగా మాట్లాడిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
జనసేన నుంచి వైసీపీకి ఫిరాయించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ నేతలు కొత్త కథ వినిపించడం ప్రారంభించారు. ఆయన ఏదో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్ గా చిత్రీకరించినట్లు వీడియోలు లీక్ చేసి.. తరువాత ఆయనతోనే ఇది నిజం చెప్పించే విన్యాసాలు ప్రారంభించారు. ఎలాగో కూలి మీడియా అలాంటి వాటిని హైలెట్ చేసేందుకు రెడీగా ఉంటుంది. అసలు రాపాకే ఫిరాయింపు ఎమ్మెల్యే. ఇండిపెండెంట్ గా పోటీ చేసి 300 ఓట్లు కూడా తెచ్చుకోలేని నేతను.. అన్ని పార్టీలు తిరస్కరిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారు.
వైసీపీ లో చేరిన రాపాక వరప్రసాద్..
2019లో అతి కష్టం మీద రాపాక వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జనసేన పార్టీని వీడి అధికార పార్టీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద దారుణమైన కామెంట్లు చేశారు. ఓ సందర్భంలో అరెస్టు చేస్తారంటే పవన్ గట్టిగా నిలబడ్డారు కూడా. అయినా ఏదో ఆశించి వైసిపిలో చేరడమే కాకుండా.. ఇప్పుడు టిడిపి డబ్బులు ఆఫర్ చేసిందంటూ కొత్త కథలు అల్లుతున్నారు. ఎవరు చేశారంటే ఉండి ఎమ్మెల్యే చేశారంటున్నారు. తనను ప్రలోభ పెట్టారని చెబుతున్నారు. జనసేన ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో కనిపిస్తే పిచ్చపాటిగా మాట్లాడటం కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడలేదని ఉండి ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సజ్జల ఆరోపణలతో.. పల్లవి అందుకున్న రాపాక..
ఎమ్మెల్యే టిడిపి నుంచి డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి బలం చేకూర్చాలనే ఉద్దేశంతో రాపాక ఈ కొత్త పల్లవి అందుకున్నారు. వారేమో డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేసి.. సజ్జల రామకృష్ణారెడ్డి పై రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. దానికి కౌంటర్ అన్నట్టుగా ఇలాంటి వీడియోలను వైసీపీ నేతలు విడుదల చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇలాంటి చీప్ రాజకీయ టెక్నిక్లు, వైసిపి, ఐ ప్యాక్ బ్రాండ్ అని ప్రజలకు అర్థమయిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. అసలు రాపాక ఎంత తీసుకొని పవన్ కళ్యాణ్ ను మోసం చేశారో చెప్పాలన్న డిమాండ్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.

ప్రణాళిక ప్రకారం రాపాకను రంగంలోకి..
టిడిపి అభ్యర్థికి ఓటు వేసేందుకు ఒక్కో ఎమ్మెల్యే కు 5 నుంచి 10 కోట్లు ఆఫర్ చేశారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రోజుల కిందట వైసిపి నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు. దీనిపై సదరు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దమ్ముంటే డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. అయితే విమర్శలు చేసిన వ్యక్తి దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా రాపాక వరప్రసాద్ ను కూడా ఈ విధంగా టిడిపి నాయకులు అప్రోచ్ అయ్యారు అనేలా వ్యాఖ్యలు చేయించారు. దీనివల్ల, నిజంగానే టిడిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. వైసిపి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కామెంట్లు చేయించడం ద్వారా కార్నర్ కు గురయింది అన్న విమర్శలు వస్తున్నాయి. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రాతిపదికన వైసీపీతో అంట కాగుతున్నారని, వైసీపీ ఎంత మొత్తం చెల్లించి రాపాక తీసుకుందో అన్న ప్రతి విమర్శలు వస్తున్నాయి.