Rajya Sabha Elections: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే వైసిపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.అటు తెలుగుదేశం పార్టీ సైతం పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. బిజెపితో పొత్తు కుదురుతున్న నేపథ్యంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. పొత్తు క్లారిటీ వస్తే మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మార్చుతూ వైసీపీ దూకుడు మీద ఉంది. ఆ మార్పులకు అనుగుణంగా రాజ్యసభ స్థానాలకు జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు. సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఎంతో పెద్ద మార్పు ఉంటే కానీ.. ఈ ముగ్గురు అభ్యర్థులను మార్చే ఛాన్స్ లేదు. ఆ ముగ్గురిని అసెంబ్లీకి రావాలని వైసిపి నాయకత్వం సమాచారం ఇచ్చింది. అసెంబ్లీ చివరి సమావేశాలు కావడంతో… ఈ రోజున ఆ ముగ్గురిని శాసనసభ్యులకు పరిచయం చేయనున్నారు. ఆ ముగ్గురు గెలుపు కోసం అవసరమైన నెంబర్ తో ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తున్నారు. టిడిపి పోటీ చేస్తే పోలింగ్ జరుగుతుంది. లేకుంటే ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటనకు వైసిపి ఎదురుచూస్తోంది.
శాసనసభలో సంఖ్యాపరంగా మూడు సీట్లను వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. బిజెపి సైతం సానుకూలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందా? అన్న చర్చ నడుస్తోంది. వైసీపీలో టిక్కెట్ రానివారు ఇప్పటికే కొంతమంది టిడిపి, జనసేనకు టచ్ లోకి వచ్చారు. మరికొందరు వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇలా అందర్నీ తమ వైపు తిప్పుకుంటే రాజ్యసభ స్థానం గెలుపొందవచ్చని టిడిపి భావిస్తోంది. బిజెపి అగ్రనాయకత్వం సమ్మతిస్తే కీలక నేతను పోటీ చేయించేందుకు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే స్పీకర్ టిడిపి, వైసిపి రెబల్స్ పై అనర్హత వేటు వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయమైతే రాజ్యసభ ఎన్నికల్లో సరికొత్త అభ్యర్థి బరిలో దించే అవకాశం ఉంది. ఇప్పటివరకు టిడిపి నుంచి వర్ల రామయ్య, కోనేరు సతీష్ పేర్లు వినిపించాయి. బిజెపి కానీ ఒప్పుకుంటే.. టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఓ నేతకు పోటీలో దించుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. పొత్తుల లెక్క ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. అమిత్ షా అనుమతించిన తర్వాత రాజ్యసభ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికల ముంగిట జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు అన్ని పార్టీల్లో సెగలు రేపుతున్నాయి. ఒకవేళ బిజెపి అగ్రనాయకత్వం టిడిపి తో చేతులు కలిపితే.. రాజ్యసభ ఎన్నిక రంజుగా మారే అవకాశం ఉంది.