Atchannaidu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్ టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. టిడిపి తో పొత్తు కొనసాగుతూనే బిజెపి కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ పరిణామాలు మారుతున్నాయి. నేరుగా బిజెపి అగ్రనేతలతో సమావేశమైన చంద్రబాబు పొత్తులపై సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే చంద్రబాబు చొరవ తీసుకుని బిజెపి పెద్దలను కలిశారా? లేకుంటే బిజెపి అగ్రనేతల పిలుపుమేరకు చంద్రబాబు వెళ్లారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేసింది. జనసేన మద్దతు ప్రకటించింది. 2018 వరకు టిడిపి ఎన్డీఏలో కొనసాగింది. తరువాత విధానపరమైన అంశాలతో విభేదించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. అప్పటినుంచి చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఇటీవల బిజెపి విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి వస్తే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టాక్ నడిచింది. దీంతో బిజెపి కోసం చంద్రబాబు ప్రయత్నాలు విడిచి పెట్టారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని తెరదించుతూ చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు.
అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక జరిగిన పరిణామాలను టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు నోరు జారారు. బిజెపి అగ్ర నేతల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని చెప్పుకొచ్చారు. భేటీలో ఏం జరిగింది అనేది చంద్రబాబు వెల్లడిస్తారని.. బిజెపితో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని తేల్చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనమే తమకు ముఖ్యమని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ఈరోజు ఉదయం హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ ఆ టూర్ రద్దయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళనున్నారు. బిజెపి అగ్ర నేతల ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. పవన్, చంద్రబాబులతో సమావేశమైన అనంతరం అమిత్ షా, జేపీ నడ్డా పొత్తుపై ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈరోజు రాత్రికి సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తెచ్చి.. రేపు పొత్తుపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు వేచి చూడక తప్పదు.