Revanth Reddy: వరుస ఓటములు.. పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్ళు ఫిరాయింపు.. దీనికి తోడు పార్టీలో కోవర్టులు.. తెలంగాణ ఇచ్చినప్పటికీ అధికారానికి దూరం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి అప్పగించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా అధికార పక్షాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉన్నారు. కొడంగల్ లో తనను ఓడించిన అధికార పార్టీకి మల్కాజ్ గిరి గెలుపు రూపంలో సమాధానం చెప్పారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లో లక్షలాదిమంది తో జన సమీకరణ చేసి నిరుద్యోగ సైరన్ పేరుతో సభ నిర్వహించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవానికి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఇలాంటి తరుణంలో సీనియర్ల సహాయ నిరాకరణ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తోంది. రేవంత్ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ, కేడర్ ను కదిలిస్తూ శక్తి మేర పోరాడుతున్నప్పటికీ అంతర్గత కలహాలు పార్టీని వెనక్కి లాగుతున్నాయి.

మహా అయితే ఏడాది
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మహా అయితే ఏడాది సమయం ఉంది. బలమైన ప్రత్యర్థులపై పోరాటానికి ఓ ప్రతిపక్షం కాలూచేయీ కూడదీసుకునేందుకు ఈ సమయం చాలా తక్కువ. పైగా కాంగ్రెస్ కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక నాటికి కర్ణాటక మినహా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కొంచమైనా ఆశతో చెప్పగలిగే రాష్ట్రాలు లేవు.. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే స్థానిక సమస్యలపై ఉద్యమాలు, వర్గ విభేదాలు వీడి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉమ్మడిగా పోరాడితేనే కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారమనే రేసులో నిలపగలవు. అప్పుడే బిజెపిని తోసిరాజని టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయంగానూ భావించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో రెండు పార్టీలు బలంగా ఉండి, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధానంగా ఆ పార్టీని గెలిపిస్తూ ఉండేది. ఇప్పుడు బిజెపి కూడా తెరపైకి వచ్చినందున కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోకుంటే కష్టమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు గత లోక్ సభ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్, తాజాగా మునుగోడులో కాంగ్రెస్ పై చేయి సాధించిన బిజెపి ప్రత్యామ్నాయ రేసు లో సవాల్ విసురుతోంది. హుజురాబాద్, మునుగోడుల్లో బిజెపి సంప్రదాయ ఓటింగ్.. కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఈ రెండు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల టిఆర్ఎస్ కు ప్రధాన పోటీదారులుగా నిలవడం తో కాంగ్రెస్ ఓటు బ్యాంకూ భారీగా బీజేపీకి బదిలీ అయింది.
తప్పు పడుతున్నారు
కేడర్ మొత్తం ఉత్సాహంగా ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి తలపెట్టిన నియోజకవర్గ పర్యటనలనూ కొందరు నాయకులు తప్పు పడుతున్నారు.. అనుమతి లేకుండా రావడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.. ఈ తీరు కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తున్నది. వాస్తవానికి మెజారిటీ డిసిసి అధ్యక్షులు, పార్టీ నేతల ఆమోదంతోనే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఆయన ఏ సభకు వెళ్లినా కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అయితే కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు ఇస్తుండడంతో సీనియర్ నేతల్లో అసహనం వ్యక్తమవుతున్నది. సీనియర్ నాయకులు వి హనుమంతరావు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో సహా పలువురు రేవంత్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు.
కర్ణాటకలో అలా ఇక్కడ ఇలా
పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడు మీద ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అధికార బిజెపికి ప్రధాన పోటీదారుగా ఉండటం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం కూడా కలిసి వస్తోంది.. అనుకూల వాతావరణానికి తోడుగా ప్రజా సమస్యలపై పార్టీ కలిసికట్టుగా పోరాడుతూ వస్తోంది.. ఆ స్ఫూర్తి తెలంగాణ కాంగ్రెస్ లో కొరవడింది.. అధిష్టానం సూచించిన కార్యక్రమాలూ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో కావడం లేదు.. అదే కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలో పార్టీకి కొంత సహాయంగా ఉంటుందని ఆశ ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది.

ఐక్యత ఎక్కడుంది
నేతల మధ్య ఐక్యత లేకపోవడం అనే సంస్కృతి, ఉప ఎన్నికల్లో ఓటముల పరంపర సహా పార్టీలో మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఎదుర్కొన్న అసంతృప్తులు, అసమ్మతులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొంటున్నారు. రేవంత్ వచ్చాక హుజరాబాద్, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. దీంతో అధ్యక్షుడు మారినా పార్టీ భవితవ్యం మారలేదని ఆవేదన కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది. వాస్తవానికి పార్టీ పునర్ వైభవం కోసం రేవంత్ రెడ్డి ప్రజాకర్షణకు తోడుగా వివాకర్త సునీల్ కనగోలు బృందాన్ని అధిష్టానం దింపింది. కానీ రేవంత్ విస్తృత ప్రచారం, సునీల్ వ్యూహం మునుగోడులో కాంగ్రెస్ ను ప్రధాన పోటీదారుగా నిలపలేకపోయాయి. ఇక్కడ బిజెపి ఓడిపోయినప్పటికీ కేవలం 10000 ఓట్ల తేడాతో రెండో స్థానం నిలవడం కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ఆధారంగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్.. ఇలా ఏదో ఒకదానిని ఎంచుకునేందుకు వివిధ పార్టీలోని నేతలు వేచి చూస్తున్నారు. ఇక ప్రత్యామ్నాయ రేసులో బిజెపి దూసుకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కఠిన కాలం ఎదురవనుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటే అధికారంలోకి వస్తుంది. లేకుంటే మరో ఐదేళ్లపాటు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడడం ఖాయం.