Prakasam YCP: ప్రకాశం జిల్లాకు చెందిన వైసిపి సీనియర్ నేతలు పక్క చూపులు చూస్తున్నారా? పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ జాబితాలో సీనియర్లు ఉండడం విశేషం. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సిద్దా రాఘవరావు, వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తదితరులు వైసీపీ నుంచి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వీరు టిడిపి తో పాటు జనసేన నాయకత్వానికి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.
గత కొన్నాళ్లుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత ఆయనకు నాలుగు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఆయనకు వైవి సుబ్బారెడ్డి తో ఉన్న విభేదాలు కారణంగా పార్టీ సమన్వయకర్త బాధ్యతల నుంచి తనకు తానుగా తప్పుకున్నారు. సీఎం జగన్ నచ్చజెప్పినా వినలేదు.తనకు మంత్రి పదవి పోవడానికి, రాజకీయంగా అణగదొక్కడానికి వై వి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ పలుమార్లు బాలినేని ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఇటీవల ఆయన అనుచరులు భవనం శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి ని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ హై కమాండ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదంతా జగన్ కు తెలిసే జరిగిందని బాలినేని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల అనంతరం సిద్దా రాఘవరావు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు. 2014లో గెలిచిన రాఘవరావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో ఓటమితో ఆయనకు భయపెట్టి వైసీపీలో చేర్చుకున్నారు. రాజ్యసభ తో పాటు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నాలుగున్నర ఏళ్ళు అవుతున్నా ఏమి పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్ పదవిని సైతం సిద్దా రాఘవరావు ఆశించారు. జగన్ తో పాటు వైసీపీ నేతలకు కలిసి విన్నవించారు. కానీ జగన్ మొండి చేయి చూపారు. అప్పటినుంచి ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టిడిపిలో కానీ.. జనసేనలో కానీ చేరేందుకు సిద్ధపడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సైతంవైసీపీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన… ఎన్నికల అనంతరం వైసిపి గూటికి చేరారు. ఈయన నందమూరి బాలకృష్ణ కు అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల్లో కనిగిరి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో మాత్రం ఈయనను దర్శికి పంపించారు. ఈయన అయిష్టతతోనే అప్పట్లో వైసీపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీలో చేరి మూడేళ్లు అవుతున్నా ఏ పదవి కేటాయించకపోవడంతో మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు సైతం వినిపిస్తోంది. పార్టీ హై కమాండ్ తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకత్వానికి జలక్ ఇచ్చేందుకు నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి హై కమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు.. అసంతృప్త నేతలతో పార్టీ మారి గట్టి దెబ్బ కొట్టాలన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.