Dokka Manikya Vara Prasad: వైసీపీ సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు. జగన్ సముచిత స్థానం కల్పిస్తూ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి గా కూడా నియమించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ అని డొక్కా సంబరపడిపోయారు. కానీ ఉన్నపలంగా ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఆయన తప్పించి మేకతోటి సుచరితను నియమించారు. దీంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఎందుకు ఇలా చేశారో అడిగి ఎందుకు జగన్ అపాయింట్మెంట్ కోరిన ఫలితం లేకపోతోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి డొక్కా మాణిక్య వరప్రసాద్ను అన్ని విధాల ప్రోత్సహించారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. సబ్జెక్టు మీద మంచి కమాండ్ ఉంటుంది ఆయనకు. అందుకే జగన్ పిలిచి మరి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. దీంతో రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్ వద్ద కూడా తన పలుకుబడిన అమాంతం పెంచుకున్నారు. కానీ ఒక ఎమ్మెల్సీగా ఉండి జగన్ అపాయింట్మెంట్ దొరకకపోవడం డొక్కా మాణిక్య వరప్రసాద్ ను బాధిస్తోంది. కనీసం పార్టీలో ఏం జరుగుతుందో చెప్పడం లేదని ఆయన బాహటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఏం జరిగినా సీఎం జగన్ చెబితేనే జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. తనను ఎందుకు తొలగించారు తెలియకపోవడం బాధాకరం అని గుంటూరు సాధికారిక సభలోనే డొక్కా వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాలని వేదికపై ఉన్న నేతలను ఆయన కోరడం విశేషం.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇన్చార్జిగా ఉన్న తాడికొండ కూడా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత ఇన్చార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. ఒక ఆరు నెలల పాటు డొక్కా ఆ పదవిలో కొనసాగారు. కానీ ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటినుంచి అసంతృప్తిగానే ఉన్నారు. కనీసం ఎందుకు తప్పించారో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా సొంత పార్టీ వేదిక మీదనే సీనియర్ నేత ఇలా ఆవేదన వ్యక్తం చేయడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మరి డొక్కా వేరే ఆలోచనతో ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది.