Chandrababu: ఎన్నికలు అన్నాక పొత్తులు సర్వసాధారణం. ప్రత్యర్థుల బలాబలాలను బట్టి, రాజకీయ సమీకరణలు బట్టి పొత్తులు పెట్టుకుంటారు. ఒక్కోసారి పొత్తులు ఫలితం వస్తాయి. మరికొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి. అయితే పొత్తులు పెట్టుకున్న తరుణంలో మిత్రపక్షాల పార్టీ కండువాలను కప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా అటువంటి అనివార్య పరిస్థితి ఎదురయ్యింది. జనసేన కండువా కప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు జనసేనలో చేరారని ట్రోల్ చేయడం విశేషం.
అయితే చంద్రబాబుపై ఇతర ప్రచారం ఇప్పటిది కాదు. 2009 ఎన్నికల్లో సైతం ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అప్పటి టిఆర్ఎస్, వామపక్షాలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం రూపంలో త్రిముఖ పోటీ నెలకొనడంతో కూటమి కట్టడం అప్పట్లో అనివార్యంగా మారింది. ఆ సమయంలో టిఆర్ఎస్ తో పాటు వామపక్షాల కండువాలను చంద్రబాబు వేసుకున్నారు. కానీ అప్పటికి సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు. లేకుంటే మాత్రం గులాబీ, పసుపు, ఎరుపు కండువాలతో చంద్రబాబు నిండైన చంద్రుడిగా కనిపించారు.
2018లో సైతం చంద్రబాబు కాంగ్రెస్ కండువాతో కనిపించారు. సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నారు. హైదరాబాదులోని ఓ సమావేశంలో ఓ మహిళ కాంగ్రెస్ కండువాను చంద్రబాబు మెడలో వేశారు. అప్పట్లో జాతీయస్థాయిలో ఇది చర్చగా మారింది. ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పురుడుబోసుకుందో.. అదే పార్టీ కండువాను టిడిపి అధినేతగా చంద్రబాబు వేసుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం.. పొత్తు వికటించింది. అటు తర్వాత ఏపీ ఎన్నికల్లో సైతం చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచే చంద్రబాబుకు కష్టాలు ప్రారంభమయ్యాయి.
తాజాగా సొంత నియోజకవర్గ కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని అధికార పార్టీ కంకణం కట్టుకుంది. అందుకే ఎన్నడూ లేని విధంగా గత ఏడాది ఎనిమిది సార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. తాజా పర్యటనలో ఆయన జనసేన శ్రేణులతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తాను పరిష్కరిస్తానని.. రెండు పార్టీలు ఉమ్మడిగా పోవాలని కోరారు. ఈ సందర్భంగా ఓ జనసేన నేత పార్టీ కండువాను చంద్రబాబు మెడలో వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది. పవన్ ఎన్నడు టిడిపి కండువా వేసుకోలేదని.. చంద్రబాబు మాత్రం జనసేన కండువా వేసుకున్నారని.. ఇంతకంటే అన్యాయం ఏముంటుందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నెట్ ఇంట్లోఈ వీడియోతో పాటు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.