Maarisetty Raghavaiah: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పొత్తుల పార్టీల మధ్య కత్తులు దూసేలా ఈ ఘటన జరిగింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకొని ముందుకెళుతున్నాయి. రెండు పార్టీల నేతలు కలిసి సాగాల్సిన సమయం. కానీ జనసేన నుంచి బీజేపీలోకి కీలక వ్యూహకర్త మారడం షాకింగ్ గా మారింది. ఇది రెండు పార్టీల మధ్య ఏదైనా పొరపొచ్చాలకు కారణం అవుతుందా? అన్న చర్చ కూడా సాగుతోంది.
జనసేన వ్యూహకర్తగా పనిచేసి.. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మారిశెట్టి రాఘవయ్య బీజేపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ సీనియర్ నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
మారిశెట్టి రాఘవయ్య తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన శ్రీకాకుళంలో జరుగుతున్న జలం కోసం.. ఉత్తరాంధ్ర జనపోరు యాత్రకు హాజరయ్యారు. అనంతరం అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.
మూడేళ్ల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేశానని.. ప్రధాని మోదీ సంక్షేమ పాలన నచ్చి బీజేపీలో చేరినట్లు రాఘవయ్య తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేసిన సమయంలో జనసేన బీజేపీకి మిత్రపక్షంగా లేదని గుర్తు చేశారు. మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. మళ్లీ రాజకీయాల్లో కొనసాగాలనే భావించి బీజేపీలోకి వచ్చానని రాఘవయ్య తెలిపారు. గతంలోనూ తాను బీజేపీలో పనిచేశానని.. తర్వాత ప్రజారాజ్యం, జనసేన పార్టీలో పనిచేసినట్లు తెలిపారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో రాఘవయ్య కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరి.. 2019 ఎన్నికల వరకూ ట్రెజరర్ గా బాధ్యతలన్ని నిర్వహించారు. అధినేత పవన్ కు సన్నిహితంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఫలితాల తర్వాత ఉన్నట్లుండి పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారాణాలతోనే పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కు లేఖ పంపారు. గతంలో జనసేన పార్టీ నేతగా ఉన్న రాఘవయ్య ఇప్పుడు పార్టీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది.
కాగా రాఘవయ్య బీజేపీలో చేరాక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. శ్రీకాకుళం లో బ్లూ ఎర్త్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రముఖ రాజకీయ పార్టీలకు క్రియాశీలక వ్యక్తిగా, వ్యూహాత్మక శక్తిగా పనిచేసిన సీనియర్ నాయకులు రాఘవయ్య గారి అవసరం , సేవలు బిజెపి కి చాలా అవసరం అన్నారు. త్వరలోనే కీలక బాధ్యతలు కూడా పార్టీ పెద్దలు అప్పగించ నున్నారని ఆమె అన్నారు. నిబద్ధత,నిజాయితీ కలిగిన రాఘవయ్య అనుభవం ఉత్తరాంధ్ర లో పార్టీ కి కలిసి వస్తుందని అన్నారు.పైగా బీజేపీ లో తొలి తరం నాయకులతో సుదీర్ఘ కాలం పనిచేసిన రాఘవయ్య మళ్ళీ తన సొంత గూటికి చేరటంతో పున స్వాగతం పలికి నట్లు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ మారి శెట్టి రాఘవయ్య తో సుదీర్ఘ అనుబందం వుందన్నారు. సీనియర్ బిజెపి నాయకులు వేణుగోపాల్ రెడ్డి తరం నుంచి పార్టీ కోసం కష్ట పడ్డామని గుర్తు చేశారు. ముప్పై ఏళ్లుగా ప్రజా జీవితంలో వుంటూ నిస్వార్థ సేవ చేస్తున్న రాఘవయ్య రాకతో పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందని అన్నారు. మారి శెట్టి రాఘవయ్య మాట్లాడుతూ కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ఆలోచనలకు , పరిపాలనా తీరు ఆకట్టుకుందని, ప్రజా సంక్షేమం కోసం నిజమైన పాత్ర పోషిస్తున్న బి జె పి బలో పేతం చేయటానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పదవుల కోసం కాదని , పార్టీ ఏ బాధ్యతలు అప్పగించిన కష్టపడి పనిచేస్తానని అన్నారు.
కార్యక్రమంలో కాకినాడ వైఎస్సార్ పార్టీ యూత్ కన్వీనర్ ఖాదా సతీష్, జన సేన తూ గో జిల్లా యూత్ కన్వీనర్ నాయుడు , సిక్కోలు బుక్ ట్రస్టు ఫౌండర్ ప్రముఖ సాహితీ వేత్త దుప్పల రవికుమార్, రాజాం కు చెందిన ఏ బి వి పి నాయకులు రావి శ్రీకర్, మత్స కార సామాజిక వర్గ నాయకులు బట్టి రాజు, ఉత్తరాంధ్ర కు చెందిన పలువురు విద్యా వేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఉత్సాహంగా పార్టీ లో చేరారు.అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాఘవయ్య నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.