Bandi Sanjay: బీజేపీ తెలంగాణ సారథిని తప్పించే ప్రయత్నాలు ముమ్మరం అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కొంతమంది సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు సీనియర్ల తీరు ఇటు కమల దళపతికీ తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరుగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ సారథిని మార్చాలని అధిష్టానంపై సీనియర్లు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

చేరికలను అడ్డుకుంటున్న సీనియర్లు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు వెల్లువెత్తాయి. సంజయ్ మొదటి విడత పాదయాత్ర వరకు ఈ వలసలు కొనసాగాయి. తర్వాత చేరికలు నిలిచిపోయాయి. పార్టీ అధ్యక్షుడిగా చేరికలకు సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నా.. సొంత పార్టీ నేతల తీరు తలనొప్పిగా మారుతోంది. కొందరు సీనియర్లు పార్టీలో చేరికలను అడ్డుకుంటున్నారు. బండి సంజయ్ వ్యతిరేకవర్గం వారికి అండగా నిలిస్తోంది. ఇంకొందరు పార్టీ కీలక నిర్ణయాలను కొందరు లీక్ చేస్తున్నారు.
Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చేసిన సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి
సంజయ్‌కి చెక్ పెట్టాలని..
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మొదట్లో దూకుడుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు . అయితే బండి సంజయ్ నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొంతమంది సీనియర్లు ఆయన స్పీడ్‌కు పగ్గాలు వేస్తూనే ఉన్నారు. పొంత పార్టీలోనే వ్యతిరేకులు ఉండడంతో సంజయ్ ఇటీవల స్పీడ్ తగ్గించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇదే అవకాశంగా భావించిన బండి వ్యతిరేక వర్గీయులు సమావేశాలు ముగిసేలోగా బండిని తప్పించేలా పావులు కదువుపుతున్నారు. ఈమేరకు కొంతమంది ఇటీవల ఢిల్లీకి వెళ్లి పార్టీ సీనియర్ల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
పార్టీ వ్యతరేక చర్యలపై అధిష్టానానికి నివేదిక
మరోవైపు బండి సంజయ్ కూడా పార్టీలో ఉంటూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఒక దశలో పార్టీలో మంచి జోష్ వచ్చిందని, సీనియర్ల తీరుతో క్యాడర్‌లో సందిగ్ధం నెలకొన్నట్లు బండి నివేదికలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా సీనియర్లు తీరు మార్చుకునేలా దిశానిర్దేశం చేయాలని అధిష్టానాన్ని సంజయ్ కోరినట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు బయటకు వెళ్లడం, సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అమిత్‌షా ఆశీస్సులతో..
మరోవైపు బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఆయన చొరవతోనే పార్టీ పగ్గాలు సంపద్రాయ నేతల చేతుల నుంచి బండి సంజయ్‌కి దక్కాయి. రాష్ట్రంలో పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమానికి అమిత్‌షా కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు బండి వర్గీయులు చెబుతారు. ఈ క్రమంలో తాజాగా పార్టీలో అంతర్గత పోరుపై బండి అమిత్‌షాకు కూడా నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.
Also Read:Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్