
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి బాగుపడేసరికి మరికొంత సమయం పట్టేట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటేనే అంతర్గత కలహాలు అని ముద్రపడిన పార్టీలో కొందరు సినీయర్ నాయకుల చేష్టలకు ఉత్సాహం ఉన్న నాయకులు ఢీలా పడుతున్నారు.యువ నాయకత్వానికి స్వేచ్ఛ ఇస్తే ఎలాగుంటుందో ఇప్పటికే బీజేపీ నిరూపించుకుంది. కాంగ్రెస్ లో అలాంటి వారికి బాధ్యతలు అప్పగించాలని కిందిస్థాయి నాయకుల నుంచి డిమాండ్ ఉంది. కానీ ఆ అవకాశం ఇవ్వడానికి సీనియర్లు ఇష్టపడడం లేదు. అందుకే పీసీసీ అధ్యక్షుడి విషయంలో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. పీసీపీ అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి ఎక్కవ శాతం యూత్ ఫాలోయింగ్ ఉన్నా ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి సీనియర్లు ఒప్పుకోవడం లేదు. పైగా రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల్లో సీనియర్లు పుల్లలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర కలిసొస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలియదిరిగి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు సీతక్క లాంటి నాయకులు ఫుల్ సపోర్టుగా ఉంటున్నారు.
కానీ పార్టీలోని సీనియర్లు మాత్రం ఈయన నిర్వహిస్తున్న పాదయాత్రను పట్టించుకోవడం లేదట. వారు సపోర్టు చేయకపోయినా సరే గానీ.. రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యంకు ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం దాటి పాదయాత్ర చేస్తున్నారని, వెంటనే ఆయనను ఆపాలని కోరారట. అంతేకాకుండా రావిలాలలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లకూడదని సీనియర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక అధ్యక్ష పదవి విషయంలో ఎంతోకాలంగా పార్టీని పట్టుకొని ఉన్న తమకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన అతనికి ప్రాధాన్యం ఇవ్వకూడదని సీనియర్లంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లు చర్చ జరిగింది. అంతేకాకుండా ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే తమను ఎవరూ పట్టించుకోరన్నట్లు వ్యవహరిస్తున్నారట. అయితే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళితే తమకు ఏ బాధ ఉండదని, అందుకే కొందరితో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం చేయిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇక అధ్యక్ష పదవి పెండింగ్ లో ఉంచిన అధిష్టానం సీనియర్ల మాట వింటుందా..? లేక యూత్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూస్తుందా..? అనేది చూడాలి.
Comments are closed.