Seethamraju Sudhakar: వైసీపీ తన పాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటువంటి చోట రాజకీయంగా బలోపేతం కావాలని ఆ పార్టీ భావించింది. కానీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో గట్టి దెబ్బ తగిలింది. అయినా సరే విశాఖ తో పాటు ఉత్తరాంధ్రలో కొట్టు కోసం వైసీపీ పోరాడుతోంది. అయితే ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న చాలామంది నాయకులు దూరమవుతున్నారు. పదవుల్లో ఉండగానే పక్క చూపులు చూస్తున్నారు. ఇది వైసిపి హై కమాండ్ కు మింగుడు పడని అంశం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకకాలంలో నాయకులంతా పార్టీని వీడుతుండడం కలవరపాటుకు గురి చేసే విషయం.
విశాఖలో వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడారు. నిన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతంపార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడైన సీతం రాజు సుధాకర్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. పార్టీలో తలెత్తిన విభేదాలతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఏకంగా అధినేత జగన్ కు లేఖ రాసి తన రాజీనామా వెనుక జరిగిన పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు.
సుధాకర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ ఆ ఛాన్స్ దక్కడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపంలో పోటీ ఎదురయ్యింది. అయితే కొంతకాలం కిందట విశాఖ పట్టభద్రుల స్థానం నుంచి సుధాకర్ కు పోటీ చేయించి.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలకు చెప్పాలని జగన్ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో సుధాకర్ ఓడిపోయారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే తాజాగా కోలా గురువులు సైతం ఆశావహుడిగా ఉన్నారు. దీంతో సీతం రాజు సుధాకర్ కు టికెట్ లేదని హై కమాన్ తేల్చింది. దీంతో ఆయన పార్టీకి దూరమయ్యేందుకు డిసైడ్ అయ్యారు. అయితే విశాఖలో జరుగుతున్న వరుస పరిణామాలు వైసిపికి ఇబ్బందికరంగా మారాయి.