Dadi Family: ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో దాడి వీరభద్రరావు సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు. ఆ పార్టీ ఎన్నో రకాలుగా అవకాశం కల్పించింది. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన ఆ పార్టీ వైపు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు. అయితే వైసిపి హై కమాండ్ మాత్రం దాడి వీరభద్రరావు సేవలను వినియోగించుకోలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలోకి వెళ్లి తప్పు చేశానని దాడి వీరభద్రరావు బాధపడే పరిస్థితి వచ్చింది. అలాగని టిడిపికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఈసారి తన కుమారుడు రత్నాకర్ కోసం చివరి ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు.
అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఈసారి ఆయనకు స్థానచలనం తప్పదని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అనకాపల్లి స్థానం బలమైన గవర సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. దీంతో అదే వర్గానికి చెందిన దాడి వీరభద్రరావు తన కుమారుడు రత్నాకర్ పేరు పరిశీలించాలని కోరుతున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీశెట్టి సత్యవతి తెరపైకి వచ్చారు ఆమె కూడా గవర సామాజిక వర్గానికి చెందిన వారే. ఈసారి ఆమెతో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని ప్రచారం ఉంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ఎంపీగా బరిలో దించుతారని తెలుస్తోంది. దీంతో సత్యవతి రూపంలో దాడి కుటుంబం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే 2024 ఎన్నికల్లో అవకాశం రాకుంటే మాత్రం రాజకీయంగా దాడి కుటుంబం తెరమరుగు అయినట్టే.
2014లో విశాఖపట్నం నియోజకవర్గ టికెట్ను దాడి రత్నాకర్ కు జగన్ కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో రత్నాకర్ ఓడిపోయారు. పార్టీకి కొద్ది రోజులు పాటు దూరమయ్యారు. అలాగని ఏ పార్టీలో చేరలేదు. సరిగ్గా 2019 ఎన్నికల ముందు యాక్టివయ్యారు. తన కుమారుడికి టికెట్ కేటాయించాలని దాడి వీరభద్రరావు కోరిన ఫలితం లేకపోయింది. అప్పటికే అనకాపల్లి టిక్కెట్ ను గుడివాడ అమర్నాథ్ కేటాయించారు. ఆయన గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. దీంతో నియోజకవర్గంలో దాడి కుటుంబానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పోనీ ఇప్పుడు అమర్నాథ్ ను మార్చుతారంటే ఎంపీ సత్యవతి రూపంలో ప్రత్యామ్నాయం ఉంది. దీంతో ఏం చేయాలో దాడి కుటుంబానికి పాలు పోవడం లేదు. టిడిపిలో చేరతారంటే ఆప్షన్ లేదు. జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.